తెలంగాణ

telangana

ETV Bharat / state

కొలువులకు రాచబాట - ఐటీ శిక్షణా కేంద్రాల కేరాఫ్ అడ్రస్​ @అమీర్​పేట - IT TRAINING CENTERS IN AMEERPET

ఐటీ శిక్షణకు అసలైన చిరునామాగా అమీర్​పేటలోని ఐటీ శిక్షణా కేంద్రాలు - ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా కోర్సులు ప్రారంభిస్తున్న పలు శిక్షణా కేంద్రాలు

IT Training centers In Ameerpet
IT Training centers In Ameerpet (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 1, 2024, 4:26 PM IST

IT Training centers In Ameerpet :ఆహ్లాదకరమైన అటవీ వాతావరణంతో పాటు విశాలమైన భూభాగంతో నాటి నిజాం నవాబులకు అతిథ్యమిచ్చిన అమీర్‌పేట ప్రాంతం నేడు ఐటీ కోచింగ్ సెంటర్లకు చిరునామాగా మారింది. హైదరాబాద్, బెంగళూరు నగరాలతో పాటు అమెరికా, యూకే తదితర దేశాల్లో భారీ శాలరీలతో ఉద్యోగాలు చేస్తున్న ఎంతోమంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులను తయారు చేసిన కార్ఖానా అంటే అతిశయోక్తి కాదు. అందుకే యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమీర్‌పేట’(యూఎస్‌ఏ) అని ఇక్కడి వారు ముద్దుగా పిలుచుకుంటారు.

పొరుగు రాష్ట్రాల వారు సైతం :అమీర్‌పేటలోని కోచింగ్ కేంద్రాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కర్ణాటక నుంచి అధికంగా వస్తుంటారు. 200 వరకు వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 50వేల మందికి పైగా ట్రైనింగ్ పొందుతున్నారు.

కరోనా నుంచి కోలుకొని :కరోనా సమయంలో ఐటీ కోచింగ్ సంస్థలన్నీ మూతపడ్డాయి. అయితే కొన్ని మాత్రం ఆన్‌లైన్‌లో నడిచాయి. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా పూర్వ స్థితికి చేరుకోగా 90 శాతం వరకు ప్రత్యక్ష(ఆఫ్​లైన్) శిక్షణే అందిస్తున్నారు. ఐదారు సంస్థలు అమెరికాలో ఉండే విద్యార్థులకు శిక్షణను ఇస్తున్నాయి.

శిక్షణ కాలం ఆధారంగా ఫీజు : ఆయా కోర్సుల్లో ట్రైనింగ్ పొంది, ఐటీ సంస్థల్లో జాబ్స్ సాధించాలని లక్ష్యంతో ఉన్న వారికి అనుగుణంగా ఇక్కడ కోర్సుల కాల వ్యవధిని నిర్ణయిస్తుంటారు. కోర్సును బట్టి కనీసం 2-9 మాసాల పాటు శిక్షణ ఇస్తారు. కోచింగ్, వసతి కోసం వచ్చేవారి అభిరుచి ఆధారంగా ఐటీ శిక్షణా కేంద్రాలు, హాస్టళ్లు, భోజనం లభ్యమవుతుండటం వల్ల అమీర్‌పేట రాష్ట్రంలోనే కిటకిటలాడే ప్రాంతంగా మారింది.

హోటళ్లను తలపించే హాస్టళ్లు :ఇక్కడి కొన్ని హాస్టళ్లు స్టార్‌ హోటల్‌ గదులను తలపిస్తుంటాయి. సింగిల్, డబుల్‌ రూం, ఎక్కువ మంది బస చేసే గదులు రెంట్​కు ఇస్తున్నారు. భోజనం, వైఫై సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. సౌకర్యాలను బట్టి నెలకు రూ.4వేల నుంచి రూ.15వేల వరకు ఫీజును వసూలు చేస్తున్నారు.

మార్పును అందిపుచ్చుకుంటూ :ఇక్కడి ట్రైనింగ్ కేంద్రాల నిర్వాహకులు కాలానుగుణంగా వస్తున్న కోర్సులు, మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కృతిమ మేధ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) అందుబాటులోకి రావడంతో ఏఐ కోర్సులకు డిమాండ్‌ ఏర్పడింది. డీప్‌ లెర్నింగ్, మిషన్‌ లెర్నింగ్, పైథాన్‌ ప్రోగ్రామింగ్‌ వంటి కోర్సులను కూడా పలు సంస్థలు అందిస్తున్నాయి.

శిక్షణ అందిస్తున్న కోర్సులు ఇవే :డేటా సైన్స్, డేటా అనాలిసిస్, ఏఐ, డెవోప్స్, సైబర్‌ సెక్యూరిటీ ఏడబ్ల్యూఎస్, డిజిటల్‌ మార్కెటింగ్ జావా ఫుల్‌స్టాక్, పైతాన్‌ ఫుల్‌స్టాక్, డాట్‌నెట్, , సేల్స్‌ ఫోర్స్, సర్వీస్‌ నౌ, అజూర్‌ డేటా ఇంజినీరింగ్, వెబ్‌ టెక్నాలజీస్, వీడియో ఎడిటింగ్, ఎంఎస్‌ ఆఫీస్, ఎస్‌క్యూఎల్‌ సర్వర్, ఎంఎస్‌-బీఐ, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్, ఎంఎస్‌ డైనమిక్స్, శాప్, జీసీపీ, పవర్‌ యాప్స్, ఒరాకిల్, సీ, సీ + +, క్లౌడ్‌ ఐటీక్యూ, పవర్‌ బీఐ, గ్రాఫిక్‌ డిజైన్‌ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

అమీర్‌పేటలో 1992 నుంచి ఐటీ ట్రైనింగ్ కేంద్రాలు ఏర్పాటు కావడం మొదలైంది. వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై ఉగ్రదాడి తరువాత అక్కడి ఐటీ కార్యకలాపాలు స్తంభించిపోవడం వల్ల ఇక్కడ ఐటీ శిక్షణ పుంజుకుందని నిర్వాహకులు చెబుతుంటారు. ఆదిత్యా ఎన్‌క్లేవ్, అన్నపూర్ణ బ్లాక్, నీలగిరి బ్లాక్, మైత్రీవనం, మైత్రీ విహార్, ఎస్సార్‌నగర్‌ ప్రాంతాల్లో ఎక్కువగా ఐటీ కోచింగ్ సంస్థలున్నాయి. సుమారు 2 వేల మంది వరకు వివిధ రకాల సాఫ్ట్‌వేర్‌ కోర్సులు బోధిస్తుండగా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5 వేల మంది వరకు ఉపాధిని పొందుతున్నారని అంచనా.

Typewriting Course Telangana : కనుమరుగవుతున్న టైపింగ్ శిక్షణ.. ప్రభుత్వ కొలువులకు అదే కీలకం

ఉచిత నైపుణ్య శిక్షణతో భవిష్యత్​కు బంగారు బాటలు - నిరుద్యోగుల పాలిట వరంగా 'స్కిల్​ ట్రైనింగ్'​ - Free Training In Solar Installation

ABOUT THE AUTHOR

...view details