Congress fires on Union Budget 2024 :రాష్ట్రంలో నిర్వహిస్తున్న వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ అధికారపార్టీ నేతలు దుయ్యబట్టారు. తెలంగాణపై కేంద్రానికి ఉన్న వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. విభజనచట్టం హామీల అమలు విషయంలో ఏపీకి న్యాయం చేశారని, తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. రాష్ట్రంపై వివక్ష చూపడం దురదృష్టకరమన్నారు.
మంత్రి పొంగులేటి ఫైర్.. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి రావాల్సింది రాలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర అన్యాయం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని గుర్తించకపోవడం బాధాకరమన్నారు. కేంద్రంలోని బీజేపీ మొండిచేయి చూపితే కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయాలని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని పొంగులేటి డిమాండ్ చేశారు.
మొదట్నుంచి చిన్నచూపేనని మంత్రి పొన్నం ఆక్షేపణ.. కేంద్ర ప్రభుత్వం నిధులపై బీజేపీ ఎంపీలను ప్రశ్నిస్తే, ఉపాధిహామీ కింద నిధులు తెచ్చామనటం హాస్యాస్పదమని మరో మంత్రి మంత్రి పొన్నం పేర్కొన్నారు. మూసీ శుద్ధికి నిధులు అడిగితే అవినీతి కోసం అడిగినట్లా? అని ఆయన ప్రశ్నించారు. గంగ, సబర్మతి శుద్ధిని మోదీ ప్రభుత్వం చేపట్టాలేదా? అని, కమీషన్ల కోసమే చేపట్టారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడేలా కేంద్ర బడ్జెట్ లేదన్నారు.
అఖిలపక్ష నేతలను కేంద్రం వద్దకు బీజేపీ నేతలు తీసుకెళ్తారని ఆశించామని, కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ అనే పదమే లేకుండా చేశారని మంత్రి పొన్నం ఆక్షేపించారు. తెలంగాణ అంటే మోదీకి, మొదట్నుంచి చిన్నచూపేనని, తెలంగాణ ఏర్పాటునే మోదీ ఎన్నోసార్లు అవమానించారని దుయ్యబట్టారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణ ఏర్పాటును తప్పుపట్టారని గుర్తు చేశారు.