Ration Card E KYC Last Date : బోగస్ కార్డుల ఏరివేతకు ప్రభుత్వం చేపట్టిన రేషన్‌కార్డు ఈకేవైసీ ప్రక్రియకు గడువు ముగియనుంది. ఈ నెల 31వరకు గడువు ఉండగా మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా మినహా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రక్రియ మాత్రం మెల్లగా సాగుతోంది. ఈ రెండు జిల్లాల్లో కలిపి 20-30శాతం మేర కార్డు దారులు ఈ-కేవైసీ చేయించుకోలేదని అధికారులు తెలిపారు. మరణించినవారి పేర్లు, వివాహాలు చేసుకొని వెళ్లిపోయిన ఆడపిల్లల పేర్లు తొలగించకుండా బియ్యం కోటాను తీసుకుంటున్నవారు ఉంటున్నారు.
ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన వివరాలు అప్డేట్ కొరకు గతేడాది సెప్టెంబరులో ఈ ప్రక్రియను ప్రారంభించింది. లబ్ధిదారుల వివరాలతో పాటు వేలిముద్రలను మరోసారి సేకరిస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉంటున్నవారు అక్కడి చౌకధరల దుకాణానికి వెళ్లి ప్రక్రియ పూర్తిచేసుకునే వెసులుబాటు కల్పించినట్టు అధికారులు చెప్పారు.
రేషన్ కార్డు కావాలా? - కేవైసీ చేయకపోతే ఏం జరుగుతుంది?
బోగస్ రేషన్ డీలర్లకు చెక్: ఈకేవైసీతో పాటు బోగస్ రేషన్ డీలర్లకు సంబంధించిన తనిఖీలు జరుగుతున్నాయని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పౌరసరఫరాల అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో ఇద్దరిని గుర్తించినట్లు పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రేషన్ కార్డుదారులు ఈ-కేవైసీ నమోదు చేసే కార్యక్రమం మొదలు పెట్టారు. గడిచిన రెండు నెలలుగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే ఇప్పటికి చాలా చోట్ల రేషన్‌కార్డుల ఈ-కేవైసీ అప్డేట్ చేయాల్సింది ఉందని సమాచారం. గడువు ఉంది కదా అని కొందరు లైట్ తీసుకుంటుండగా ఆధార్ అప్డేట్ సమస్యలతో చాలా మంది ఈ-కేవైసీ పూర్తి చేయలేకపోతున్నారని అధికారులు తెలిపారు.