Jagananna Housing Constructions Scam in Raptadu : అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి (Thopudurthi Prakash Reddy) వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తన రాక్రీట్ సంస్థ ద్వారా లబ్ధిదారులకు ఇళ్లు కట్టించే కంట్రాక్టు తీసుకున్నారు. అనంతపురం గ్రామీణ మండలంలో ఆలమూరు, కొడిమి గ్రామాల్లో 7,648 ఇళ్లు నిర్మించి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. లబ్దిదారులకు ఇచ్చే రూ.1,80,000, లబ్దిదారుడి నుంచి మరో రూ.35,000 రూపాయలు తీసుకొని ఇల్లు నిర్మించి ఇవ్వాల్సి ఉంది.
ఒక్క ఆలమూరు, కొడిమిలోనే 6,000 ఇళ్లు నిర్మించాలి. అయితే ఎక్కడా ఇళ్లను నాణ్యతగా నిర్మించకపోగా, అసంపూర్తి నిర్మాణంతో లబ్దిదారులకు చుక్కలు చూపించారు. ఇళ్లకు తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్ పూర్తిచేయకుండానే బిల్లు పెట్టి నిధులు కాజేశారు. ఇదే లేఔట్‌లో ఇంటి పట్టాలు పొందిన 272 మందికి లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు కాలేదు. వీరంతా తమకు ఇల్లు మంజూరు చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతుంటే, వారిపేరుతో రాక్రీట్ సంస్థ సిమెంటు, ఇసుక, స్టీల్ తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
టీడీపీపై పగ - పేదలపై కక్ష - సొంతింటి కలను పాతరేసిన జగన్ సర్కార్ - Jagananna Colonies Problems
అనంతపురం జిల్లాలో ఇళ్ల నిర్మాణానికి ఒప్పందం చేసుకున్న రాక్రీట్ సంస్థ కేవలం 1945 ఇళ్లు మాత్రం నిర్మించినట్లు రికార్టుల్లో నమోదైంది. పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పిన సంస్థ ఏడాదికి సరిపడా స్టీల్‌ను తీసుకుంది. ఈ స్టీల్ వర్షానికి తడిసి తుప్పుపట్టి, నిర్మాణానికి పనికిరాకుండా తయారైంది. ఇళ్లు నిర్మించే కాంట్రాక్టర్ క్షేత్రస్థాయిలో చేసిన పనిని పరిశీలించి, 3నెలలకోసారి ఇనుము, సిమెంట్ మంజూరు చేయాలి. కానీ ముందుగానే ఇళ్ల నిర్మాణానికి సరిపడా సిమెంటు మంజూరు చేశారు.
ఇళ్ల నిర్మాణానికి తుపుదుర్తి సొంతంగా సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేశారు. ఇళ్లు మంజూరు కానీ లబ్దిదారుల పేరు మీద సిమెంట్, స్టీల్ తీసుకున్న రాక్రీట్ సంస్థ మొత్తం మెటీరియల్‌ను తమ అవసరాలకు వినియోగించుకున్నట్లు విమర్శలున్నాయి. ఇలా తీసుకున్న సిమెంట్, ఇసుకను సొంత ఇటుకల పరిశ్రమలో వాడుకొని, అవే ఇటుకలతో అరకొరగా ఇళ్ల నిర్మించి, ప్రభుత్వ సొమ్మునే పెట్టుబడిగా వ్యవహారం నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.