Rave Party Busted In Madhapur :మాదకద్రవ్యాలను కట్టడి చేయడానికి ప్రభుత్వం, పోలీసులు ఎన్ని పటిష్ట చర్యలు చేపడుతున్నప్పటికీ నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మత్తు పదార్ధాలు బయటపడుతునే ఉన్నాయి. విదేశాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి మాదకద్రవ్యాలు నగరానికి చేరుతూనే ఉన్నాయి. అయితే మూలాల్లోకి వెళ్లి మరింత పకడ్భందీగా చర్యలు చేపట్టాల్సి ఉంది.
తాజాగా సైబర్ టవర్స్ వద్ద ఉండే క్లౌడ్ నైన్ సర్వీసు అపార్ట్‌మెంట్‌లో స్థిరాస్తి వ్యాపారితో పాటు అతని సోదరుడు మరో 18 మంది రేవ్ పార్టీ చేసుకుంటుండగా ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించి పార్టీని భగ్నం చేశారు. అయితే ముందుగా పార్టీ గురించి సమాచారం అందుకున్న పోలీసులు వారి కదలికలను గుర్తించి దాడి చేశారు.
స్థిరాస్తి వ్యాపారి జన్మదినం సందర్భంగా రేవ్‌పార్టీ :స్థిరాస్తి వ్యాపారి నాగరాజు యాదవ్ జన్మదినం సందర్భంగా ఈ పార్టీ నిర్వహించినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. అతని సోదరుడు సాయి కుమార్ యాదవ్ ఇటీవల దుబాయ్ వెళ్లి వచ్చి విదేశీ మద్యం తీసుకువచ్చినట్టు విచారణలో బయటపడింది. పట్టుబడిన వారిలో ఆరుగురు యువతులుండగా వారిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్, ఇంజినీరింగ్, డెంటల్ విద్యార్థిని, గృహిణి, సేల్స్ విభాగంలో పనిచేసే యువతి ఉన్నారు.
ఇద్దరు డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారణ :అయితే జన్మదిన వేడుకల్లో పాల్గొన్న వారిలో అధిక శాతం నాగరాజు బంధువులే ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరి వద్ద ఒక గ్రాము కొకైన్, 2 గ్రాములు ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. అపార్ట్‌మెంట్‌లో పోలీసుల దాడులకు ముందే వీరిలో కొందరు మాదకద్రవ్యాలను స్వీకరించినట్టు పోలీసులు గుర్తించారు. వీరికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరు డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది.