వరద బాధితులకు రామోజీ ఆపన్నహస్తం :తెలంగాణలో 2020లో భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయి అల్లాడుతున్న ప్రజలకు రామోజీ గ్రూపు ఛైర్మన్ రామోజీ రావు చేయూతనందించారు. రామోజీ గ్రూపు సంస్థల తరఫున ఆయన ముఖ్యమంత్రి సహా యనిధికి రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును సంస్థ ప్రతినిధులు అప్పటి పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందజేసి బాధితులకు బాసటగా నిలచిన రామోజీ గ్రూప్‌ను అప్పటి మంత్రి కేటీఆర్ అభినందించారు. 2020లో కూడా దేశాన్ని కబళించిన కరోనా సమయంలోనూ రామోజీ గ్రూప్ సంస్థ తెలుగు రాష్టాలకు విడివిడిగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.10 కోట్ల సాయం చేసింది.
రూ. 7.77 కోట్లతో 116 పక్కా గృహాలు - కేరళ వరద బాధితులకు అండగా నిలిచేందుకు రామోజీ గ్రూపు
2019లో కూడా కేరళ వరదల్లో నిలువ నీడ కోల్పోయిన పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు 'రామోజీ గ్రూపు' శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అతిపెద్ద మహిళా సహాయక గ్రూపు 'కుటుంబశ్రీ'తో ఇందుకోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వరద బాధితులకు ఆపన్నహస్తం అందిస్తున్నందుకుగాను రామోజీ గ్రూపునకు అప్పటి కేరళ మంత్రులు ధన్యవాదాలు తెలిపారు.
2018లోనూ ఆగస్టులో కేరళను భారీ వరదలు ముంచెత్తాయి. దీంతో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. చాలామంది ఇళ్లు కోల్పోయారు. బాధితులకు అండగా నిలిచేందుకు రామోజీ గ్రూపు ముందుకొచ్చింది. గ్రూపు సంస్థల తరపున ఛైర్మన్ రామోజీ రావు రూ. 3 కోట్లతో 'ఈనాడు సహాయనిధి'ని ప్రారంభించి, దాతల నుంచి విరాళాలు ఆహ్వానించారు. 'ఈనాడు'తోపాటు రామోజీ గ్రూపులోని ఇతర సంస్థల మీద అచంచల విశ్వాసంతో వేల మంది మానవతావాదులు విరాళాలు అందించారు.