తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Jun 8, 2024, 6:28 AM IST

Updated : Jun 8, 2024, 6:51 PM IST

ETV Bharat / state

రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు అస్తమయం - Ramoji Rao Passes Away

Ramoji Rao Passed Away : ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. ఈ నెల 5న ఆయన అనారోగ్య సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఇవాళ తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు.

Ramoji Rao Passed Away  IN HYD
Ramoji Rao Passed Away IN HYD (ETV Bharat)

Ramoji Rao Passed Away in Hyderabad : తెలుగుజాతి మేరునగధీరుడు, రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న 87 ఏళ్ల రామోజీరావు, హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విచారు. ఈ నెల 5న ఆయన అనారోగ్య సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరారు.

రామోజీరావును పరీక్షించిన వైద్యులు స్టెంట్ అమర్చారు. అనంతరం ఐసీయూలో ఆయనకు చికిత్స అందించారు. ఆరోగ్యం విషమించి ఈ తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు. అనంతరం ఆసుపత్రి నుంచి రామోజీరావు పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్‌సిటీకి తరలించారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని కార్పొరేట్‌ బిల్డింగ్‌లో రామోజీ పార్థివ దేహాన్ని ఉంచగా కుటుంబసభ్యులు భావోద్వేగంతో నివాళులర్పించారు. అనంతరం వివిధ రంగాల ప్రముఖులు, సంస్థ ఉద్యోగులు రామోజీ రావుకు అశ్రు నయనాలతో నివాళులర్పించారు. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు.

రామోజీ ఫిల్మ్‌సిటీలో రేపు ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల కోసం దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుంచే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌కు సీఎస్ ద్వారా రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రామోజీరావుకు నివాళిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రేపు, ఎల్లుండి సంతాప దినాలు ప్రకటించింది. రామోజీరావు అస్తమయంపై సంతాపం తెలిపిన ఫిల్మ్‌ఛాంబర్ రేపు సినిమా షూటింగ్‌లకు సెలవు ప్రకటించింది.

Ramoji Rao Profile :కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు 1936 నవంబర్‌ 16న రామోజీరావు జన్మించారు. అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ తర్వాత ఆయన జన్మించారు. కుటుంబసభ్యులు రామోజీకి తాతయ్య రామయ్య పేరు పెట్టారు. బడిలో మాస్టారుకు తన పేరు రామోజీరావు అని చెప్పి తన పేరును తనే పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచే విలక్షణ, సృజనాత్మకత ఉన్న వ్యక్తి ఆయన. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ‘ఈనాడు’ను ప్రారంభించారు. ప్రారంభించిన నాలుగేళ్లలోనే పాఠకుల మానసపుత్రికగా ఈనాడు మారింది. ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా ‘సితార’ సినీ పత్రిక నిలిచింది.

కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం :బహుముఖ ప్రజ్ఞ కఠోర సాధన ఇవే రామోజీరావు అస్త్రాలు. నలుగురు నడిచిన బాట కాదు కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. లక్ష్య సాధనకు దశాబ్దాలపాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు. రైతుబిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు. మీడియా మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆయన చైతన్యదీప్తుల్లాంటి చిత్రరాజాలను సృజించారు. అద్భుత ఫిల్మ్‌సిటీని సృష్టించారు. తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆఖరి క్షణం వరకూ ప్రజా శ్రేయస్సు కోసమే పరితపించారు. పనిలోనే విశ్రాంతి అనేది రామోజీరావు ప్రాథమిక సూత్రం. చివరి క్షణం వరకు పనిలోనే విశ్రాంతి సిద్ధాంతాన్ని పాటించిన మహనీయుడు.

వేల మందికి ఉద్యోగ, ఉపాధి : అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ రామోజీరావు చెరగని ముద్ర వేశారు. 1962లో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను స్థాపించారు. దేశంలోనే అగ్రశ్రేణి చిట్‌ఫండ్స్‌ సంస్థగా మార్గదర్శి నిలిచింది . 60 సంవత్సరాల్లో లక్షలాదిమంది ఖాతాదారులకు నిబద్ధతతో సేవలు అందించారు. ఈ సంస్థ ద్వారా వేల మందికి ఉద్యోగ ఉపాధి కల్పించారు.

తెలుగు పత్రికారంగంలో చెరగని ముద్ర వేసిన రామోజీరావు - RAMOJIRAO SERVICES TO MEDIA

Last Updated : Jun 8, 2024, 6:51 PM IST

ABOUT THE AUTHOR

...view details