Ramoji Group Chairman Ramoji Rao Samsmarana Sabha Brahmakumaris :యువతరం రామోజీరావు జీవితాన్ని చదివి ఆచరించాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు సూచించారు. సమయ పాలన, క్రమశిక్షణకు రామోజీరావు మారుపేరు అని తెలిపారు. ఆయన నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. రామోజీరావు అనుభవాలు, ప్రసంగాలను పుస్తక రూపంలో తీసుకొచ్చి భావితరాలకు అందించాలని కోరారు.
రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు సంస్మరణ సభ బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్లో నిర్వహించారు. రామోజీరావు కుటుంబ సభ్యులు ఈనాడు ఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్, ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి, మనవరాళ్లు సహరి, కీర్తి సోహన, బృహతి, దివిజ హాజరయ్యారు. ఈ సభకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. అలాగే నటులు మురళీమోహన్, సుమన్, చదలవాడ శ్రీనివాస్, ప్రసన్న కుమార్, ఏపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సంస్మరణ సభలో పాల్గొన్నారు. అలాగే బ్రహ్మకుమారీస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, రామోజీరావు జర్నలిస్టుల ఫ్యాక్టరీ. మట్టిలోని మాణిక్యాలను వెలికి తీయడంలో, ప్రతిభను గుర్తించడంలో ఆయనకు ఎవరూ సాటి లేరు. ప్రజా పక్షం అని పదే పదే చెప్పే వారు. ప్రజాస్వామ్యానికి ఆపద వచ్చినప్పుడల్లా ప్రజా పక్షంగా నిలిచేవారు. సమాజం పట్ల ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తి. సహజ వనరుల వినియోగంలో ఆయన మహా పొదుపరి. అత్యంత నిరాడంబరమైన జీవితం గడిపిన వ్యక్తి." అని తెలిపారు.
"రామోజీరావు వల్ల నేను జీవితంలో ఎంతో లాభపడ్డాను. రామోజీరావు జర్నలిస్టుల ఫ్యాక్టరీ. మీడియాను ప్రజలకు అత్యంత చేరువ చేయడంలో రామోజీరావు ముందు ఉన్నారు. మీరు ఎవరి పక్షం అని నేను అడిగితే తాను ప్రజల పక్షమని రామోజీరావు చెప్పారు. ఆయన ఆఖరి శ్వాస వరకు ప్రజాపక్షమే వహించారు."- ఎం.వెంకయ్య నాయుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి