Ramoji Rao Quotations in Telugu: రామోజీరావు అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ చెరగని ముద్రవేశారు. విశ్వసనీయత, నిరంతర శ్రమే ఆయన అస్త్రాలు. ఆయన జీవితంలో ఎన్నో ప్రయోగాలు చేశారు! నిత్యం కొత్త దారులు సృష్టిస్తూ వ్యాపారవేత్తగా మహాసామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీరావు, కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936వ నవంబర్ 16వ తేదీన చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మకు జన్మించారు.
పెదపారుపూడిలో ప్రాథమిక విద్య పూర్తయ్యాక పైచదువులకు రామోజీ గుడివాడ వెళ్లారు. మున్సిపల్ స్కూల్లో 8వ తరగతిలో చేరారు. 11వ తరగతికి సమమైన అప్పటి Sixth Farm చదివారు. 1951లో రామోజీ హైస్కూలు చదువు ముగియడంతో, గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. అనంతరం అక్కడే బీఎస్సీ పూర్తిచేసి, భిలాయ్లో ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. కానీ అందులో రామోజీరావుకి నిరాశే మిగిలింది. దీంతో తనే పది మందికి పనిచ్చేలా ఎదగాలని భావించారు.
తరువాత కొన్ని సంవత్సరాలపాటు రామోజీరావు దిల్లీలో మళయాళీ వ్యాపారవేత్త అనంత్ నెలకొల్పిన వాణిజ్య ప్రకటనల సంస్థలో ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరారు. అనంతరం 1962 అక్టోబర్లో హైదరాబాద్ హిమాయత్ నగర్లో మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ నెలకొల్పారు. ‘మార్గదర్శి తోడుంటే ఆనందం మీవెంటే’ అనే నినాదంతో తర్వాత కాలంలో లక్షలాది ఖాతాదారులకు మార్గదర్శి చిట్ ఫండ్స్ తారకమంత్రమైంది.
తెలుగు జాతి కీర్తి శిఖరం రామోజీరావు - ఆయన విలువలూ విశ్వాసాలు మీకోసం - Ramoji Rao Success Story
దేశంలోనే నంబర్: చిట్ ఫండ్ వ్యాపారం అంటే అదేదో మహిళల వ్యవహారం అని భావించిన రోజుల్లో రామోజీ రావు అలాంటి మాటలను ఖాతరు చేయలేదు. పట్టుదలతో ముందుకు సాగారు. వసూళ్లు, చెల్లింపులు కచ్చితంగా ఉండటంతో ఖాతాదారుల్లో విశ్వాసం ఏర్పడింది. సిబ్బంది క్రమశిక్షణ, అంకిత భావం, యాజమాన్య విశ్వసనీయత వల్ల సంస్థ శరవేగంగా అభివృద్ధి చెందింది. ఆర్థిక క్రమశిక్షణ, అంకితభావం, విశ్వసనీయత.. ఈ మూడూ మార్గదర్శికి మూడు మంత్రాక్షరాలు.1995లో రూ.100 కోట్ల వార్షిక టర్నోవర్ నేడు రూ.10,683 కోట్లు దాటిందంటే అది రామోజీ బ్రాండ్.
మార్గదర్శితో రామోజీ రావు విజయయాత్రలో తొలి అడుగుపడింది. వ్యవసాయ కుటుంబంలో పుట్టి రైతుల కష్టాల్ని చూస్తూ పెరిగిన ఆయన 1969లో మీడియా రంగంలో తొలి అడుగువేస్తూ అన్నదాత పత్రికను ప్రారంభించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగరతీరంలో రామోజీరావు ప్రారంభించిన 'ఈనాడు' దినపత్రిక తెలుగు నాట ఓ సంచలనం అయింది. 50 ఏళ్లుగా ఈనాడు ప్రజాభిమానం పొందడానికి రామోజీరావుపై ప్రజలకున్న అచంచల విశ్వాసమే కారణం. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేసిన రామోజీరావు నిత్యం విలువలూ, విశ్వాసాలు పాటించేవారు.
ఐదక్షరాల మంత్రాక్షరి, అద్భుతాల పంచాక్షరి - రామయ్య 'రామోజీరావు'గా ఎదిగారిలా - Media Mogul Ramoji Rao Biography
RAMOJI RAO QUOTES IN TELUGU:
- ఎప్పుడూ రేపటి గురించే ఆలోచించు. నిన్నటి వైపు తొంగిచూడకు.
- మార్పు.. ప్రగతి రెండూ కవల పిల్లలు. మార్పుతోనే అభివృద్ధి సాధ్యం. అభివృద్ధి కోరుకుంటే కొత్తగా ఆలోచించు.
- ఎదగడానికి ఆకాశమే హద్దు. ఎప్పుడూ గొప్ప గొప్ప ఆలోచనలే చెయ్యి. ఫలితాలూ అలాగే ఉంటాయి.
- ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నీ బతుకు నువ్వే బతుకు. ఎవరి సాయం కోసమూ ఎదురు చూడకు.
- ఇతరుల చప్పట్ల కోసం కాదు, నీ అంతరాత్మను మెప్పించే పనులే చెయ్యి. విజయాలతో పాటు అంతులేని సంతృప్తీ నీ సొంతమవుతుంది.
- సవాళ్లకు ఎప్పుడూ భయపడకు. అవి కష్టాలనే కాదు.. అవకాశాలనూ మోసుకొస్తాయి.
- నీ ఆత్మాభిమానం కంటే ఏదీ విలువైంది కాదు. కష్టాలొచ్చాయని నీ వ్యక్తిత్వానికి వ్యతిరేకంగా ఎవరితోనూ, దేనితోనూ రాజీపడకు.
- ఆర్థికంగా మనజాలనిది ఏదైనా కాలగర్భంలో కలిసి పోతుంది. ఏ కొత్త పని మొదలుపెట్టినా దీన్ని గుర్తుపెట్టుకో.
- క్రమశిక్షణకు మించిన విజయ రహస్యం మరొకటి ఉండదు. అది లేనప్పుడు ఏ ప్రతిభా రాణించదు.
- వ్యక్తికైనా, వ్యవస్థకైనా నిజమైన సంపద విశ్వసనీయతే. దాన్ని కంటికి రెప్పలా కాపాడుకో!
- ప్రజల చేతిలో అస్త్రమైనప్పుడే పత్రికకు విలువ. ప్రజలే తన చేతుల్లో ఉన్నారని పత్రిక భావిస్తే ఆత్మహత్యా సదృశమే.
కోడళ్లు అనుకోలేదు.. కూతుళ్లుగానే భావించారు - రామోజీరావు కోడలు శైలజా కిరణ్ - SAILAJA KIRAN ABOUT RAMOJI RAO