Ramadan 2024 Celebrations in Telangana : రాష్ట్రవ్యాప్తంగా రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. నెల రోజుల ఉపవాస దీక్షలు ముగియడంతో ముస్లింలు ఉదయాన్నే అత్యంత భక్తి శ్రద్ధలతో మసీలు, ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలు చేశారు. రంజాన్ సందర్భంగా హైదరాబాద్‌లోని షబ్బీర్ అలీ ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆయణ్ను మర్యాదపూర్వకంగా కలిసి రంజాన్ శుభాకాంక్షలను(Ramadan Wishes) తెలియజేశారు. ముఖ్యమంత్రికి షబ్బీర్ అలీ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారి ఇంట్లోనే రేవంత్ అల్పాహారం సేవించారు. సీఎంతో పాటు పార్టీ ముఖ్య నాయకులు కూడా హాజరయ్యారు. పండగ వేళ సీఎం తన రావడం సంతోషకరంగా ఉందని షబ్బీర్ అలీ హర్షం వ్యక్తం చేశారు.
రంజాన్ సందర్భంగా హైదరాబాద్‌లోని మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హైదరాబాద్‌లోని మీర్ ఆలం ఈద్గా, చార్మినార్, మక్కా మసీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో ఉన్న మసీదులో పెద్ద సంఖ్యలో వచ్చిన ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే హైదరాబాద్ సనత్‌నగర్‌లోని వెల్ఫేర్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన రంజాన్ వేడుకలకు(Ramadan Celebrations 2024) మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు చోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదిలాబాద్‌లోని ఈద్గా మైదానంలో జిల్లా ఎస్పీ ఆలం గౌస్ సామాన్యుడిలా అందరితో కలిసి ప్రార్థనలు చేశారు. మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ తదితరులు ముస్లింలను ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
"ఈ రంజాన్ మాసం 30 దినాల్లో రాష్ట్రంలో ఎక్కడా కూడా చిన్న గొడవ అనేది జరగలేదు. లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు కలుగలేదు. ఉదయం 5 గంటల వరకు షాపులు అన్నీ ఓపెన్లోనే ఉన్నాయి. గత ప్రభుత్వంలో షాపులు అర్ధరాత్రి 2 వరకు మాత్రమే ఉండేవి. ఇప్పుడు అందుకు మరో 3 గంటలు ఎక్స్ట్రా టైమ్ అనేది ఇచ్చాము. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను."- షబ్బీర్ అలీ, ప్రభుత్వ సలహాదారుడు
రంజాన్ వేళ కిక్కిరిసిపోతున్న డ్రై ఫ్రూట్ మార్కెట్లు - ఏడాది గిరాకీ నెల రోజుల్లోనే!