తెలంగాణ

telangana

ETV Bharat / state

రమాదేవి పబ్లిక్​ స్కూల్​లో టెక్​ ఫెస్ట్​ -2024 - సరికొత్త ఆవిష్కరణలతో అలరించిన విద్యార్థులు

ఘనంగా జరిగిన రమాదేవి పబ్లిక్​ స్కూల్ -2024 టెక్​ ఫెస్ట్ - ప్రారంభించిన ఈనాడు గ్రూప్​ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు మనవడు పూర్ణ సుజయ్ - అద్భుత ఆవిష్కరణలతో అలరించిన విద్యార్థులు

Ramadevi Public School Tech Fest-2024
Ramadevi Public School Tech Fest-2024 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 9, 2024, 9:44 AM IST

Updated : Nov 9, 2024, 9:50 AM IST

Ramadevi Public School Tech Fest-2024 :చదువంటే పుస్తకాలతో కుస్తీ పట్టడం, మార్కుల కోసం పోటీ పడటమే కాదు. విషయాన్ని అర్థం చేసుకోవడం!! సరికొత్త ఆవిష్కరణలు చేయడమని చాటారు రమాదేవి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు. సైన్స్‌, టెక్నాలజీ, రోబోటిక్‌, ఆరోగ్యం ఇలా ఏ రంగాన్నీ వదలకుండా వెయ్యికి పైగా ప్రాజెక్టుల్ని రూపొందించి ఔరా అనిపించారు. లెక్కలతో మెదడుకు మేత వేశారు. చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రతిబింబించే ప్రతి రూపాలను కళ్లకు కట్టారు. రమాదేవి పబ్లిక్ స్కూల్‌లో జరిగిన టెక్ ఫెస్ట్ ఆహూతుల్ని విశేషంగా ఆకట్టుకుంది.

హైదరాబాద్​లోని రమాదేవి పబ్లిక్​ స్కూల్​ నిర్వహించిన టెక్​ ఫెస్ట్​ను ఈనాడు గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు మనవడు పూర్ణ సుజయ్ ప్రారంభించారు. పాఠశాల ట్రస్టీ రావి చంద్రశేఖర్, ప్రిన్సిపల్ ఖమర్ సుల్తానా సహా ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రోబోటిక్స్, కంప్యూటర్ సైన్స్, బయాలజీ వంటి విభాగాల్లో సరికొత్త ఆవిష్కరణలను విద్యార్థులు కళ్లకు కట్టారు.

టెక్‌ ఫెస్ట్‌లో పిల్లలు చూపిన ప్రతిభ ఎంతగానో ఆకట్టుకుందని పూర్ణ సుజయ్‌ అన్నారు. రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌లో విద్యార్థుల్ని ప్రోత్సహించడానికి ఇకపై రామోజీరావు పేరిట అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రతి రంగంలో రామోజీరావు పాటించిన విలువలతో ఆయన ఎప్పుడూ మన మధ్యే ఉంటారని పేర్కొన్నారు. విద్య, క్రీడలు సహా మిగతా అంశాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు రామోజీరావు ట్రోఫీ అందిస్తామని చెప్పారు. విద్యార్థులంతా తయారు చేసిన అన్ని ప్రాజెక్టులను స్వయంగా పూర్ణ సుజయ్ పరిశీలించారు. విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిన్నారులను అభినందించారు.

"అద్భుతమైన పిల్లలతో మమేకమైనప్పుడు జ్ఞానం కోసం వారు చూపిస్తున్న ఉత్సాహాన్ని గమనించాను. తయారు చేసిన ప్రాజెక్టులపై వారికున్న ఉద్వేగానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. పిల్లలందరికీ అభినందనలు. మీ జీవితం ముందుంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. అదేవిధంగా ఉత్సాహంగా ఉండండి. అప్పుడు ప్రపంచమే మీదవుతుంది. ఈ మంచి కార్యక్రమం సందర్భంగా ట్రస్టీ చంద్రశేఖర్, ప్రిన్సిపల్​ ఖమర్ సుల్తానా సూచనలతో ఒక కొత్త అవార్డును ప్రకటిస్తున్నాను. రమాదేవి పబ్లిక్​ స్కూల్​లోని అన్ని విభాగాల్లో దివంగత తాతగారు, గౌరవనీయులైన ఛైర్మన్​ రామోజీరావు పేరిట పురస్కారం ఇవ్వబోతున్నాం. ప్రతిరంగంలో ఆయన పాటించిన విలువలతో రామోజీరావు ఎప్పుడూ మన మధ్యనే ఉంటారు. విద్య, క్రీడలు సహా మిగతా అంశాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు రామోజీరావు ట్రోఫీ అందిస్తాం."- చెరుకూరి పూర్ణ సుజయ్, రామోజీరావు మనవడు

విద్యార్థుల రెండు నెలల శ్రమ : టెక్‌ ఫెస్ట్‌ కోసం విద్యార్థులు, టీచర్లు రెండు నెలల నుంచి కఠినంగా శ్రమించారని రమాదేవి పబ్లిక్ స్కూల్ ట్రస్టీ రావి చంద్రశేఖర్, ప్రిన్సిపల్ ఖమర్ సుల్తానా అన్నారు. చిన్నారులు రూపొందించిన ప్రాజెక్టులు ఆలోజింపజేసేలా ఉన్నాయని అభినందించారు. మరోవైపు టెక్ ​ఫెస్ట్​ విజయవంతమైనందుకు అందరికీ శుభాకాంక్షలను రమాదేవి పబ్లిక్​ స్కూల్ ప్రిన్సిపల్ ఖమర్​ సల్తానా తెలిపారు. కఠిన శ్రమ చేసిన విద్యార్థులకు, సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు. ప్రణాళికలు, ప్రాజెక్టు కోసం రెండు నెలలుగా ముని వేళ్లపై నిలబడి పనిచేశారని కొనియాడారు.

"మా టీచర్లు, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా వెయ్యికిపైగా ప్రాజెక్టుల్ని రూపొందించారు. వాటిలో చాలా వరకు ఆలోచింపజేసేవి ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి పదో తరగతి చదివి బయటకు వెళ్లే విద్యార్థుల వరకు అందరిలో ప్రతిభను వెలికి తీయడానికి ఏటా టెక్‌ఫెస్ట్‌ నిర్వహిస్తున్నాం. సాఫ్ట్‌వేర్‌, రోబోటిక్స్‌, సైన్స్‌, గణితం ఇలా ఏ విభాగాన్ని కూడా వారు వదిలిపెట్టలేదు. పిల్లలు తయారు చేసిన ప్రాజెక్టులు శాస్త్రవేత్తల్ని కూడా ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఇందులో భాగస్వామ్యమైన అందరికీ కృతజ్ఞతలు."- రావి చంద్రశేఖర్, రమాదేవి పబ్లిక్ స్కూల్ ట్రస్టీ

చిన్నారుల ఆవిష్కరణలు : టెక్​ఫెస్ట్​లో విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇంట్లో చెత్తను తొలగించేందుకు వీలుగా రోబోను ఇద్దరు విద్యార్థులు రూపొందించారు. కెమెరాలు అమర్చిన రోబోటిక్​ కార్​ని ఒంటి చేత్తో ఆపరేట్ చేసేలా ప్రాజెక్టు తయారు చేశారు. క్లిష్టమైన ప్రాంతాల్లోకి ఆ రోబో కార్‌ని పంపి పరిస్థితులను అధ్యయనం చేయొచ్చని వివరించారు. చందమామపై ఏలియన్స్ అధ్యయనం చేస్తున్నట్లుగా ఊహించి చేసిన ప్రాజెక్టు, వాయిస్ కంట్రోల్‌తో ఆపరేట్ డివైజ్‌లు ఇలా ఎన్నో పరికరాలకు ఊపిరి పోశారు.

మట్టి అవసరం లేకుండానే పంటలు పండించడం, రోబోట్స్ సాయంతో శస్త్రచికిత్స చేయడం, సోలార్ ప్రాజెక్టులు ఔరా అనిపించాయి. ప్రాజెక్టులంటే ఎనిమిది, పదో తరగతుల విద్యార్థులు చేశారనుకోవద్దు. మూడో తరగతి చిన్నారులు కూడా అనేక ఆవిష్కరణలతో ఆకట్టుకున్నారు. సంస్కృతిని చాటే బతుకమ్మలు, పెయింటిగ్స్‌ ముచ్చట గొలిపాయి. చిన్నారుల ఆలోచనలకు కాస్తంత సహకారం, ఉత్సాహం ఇస్తే చాలు ఆకాశమే హద్దుగా ఆవిష్కరణలు చేయగలరని చాటింది రమాదేవి పబ్లిక్​ స్కూల్​ టెక్​ ఫెస్ట్​-2024. విద్యార్థుల ఆవిష్కరణలను వారి తల్లిదండ్రులు చూసేందుకు పాఠశాల యాజమాన్యం ఇవాళ అవకాశం కల్పించింది.

రమాదేవి పబ్లిక్ స్కూల్​లో ఘనంగా ఆర్ట్ ఆఫ్ ఎక్స్​ప్రెషన్స్ ప్రదర్శన

రమాదేవి పబ్లిక్ స్కూల్​లో సైన్స్​ ఎక్స్​ప్లోరా వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకున్న విద్యార్థులు

Last Updated : Nov 9, 2024, 9:50 AM IST

ABOUT THE AUTHOR

...view details