Telangana Weather Update : రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మూడు రోజులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరడంతో, జలాశయాలు ఉప్పొంగుతున్నాయి. వానలకు పలు జిల్లాల్లోని రోడ్లు చిత్తడిగా మారాయి.
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు 52.1 అడుగులకు చేరింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గత వారం రోజుల నుంచి భద్రాచలం దిగువ ఉన్న వీలీన మండలాల్లోని అనేక గ్రామాలు వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. ఇప్పటికే 12 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు, ఇంకా కొన్ని ఇళ్లకు వరద నీరు చేరుతుండటంతో వారిని కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
అంతర్రాష్ట్ర రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది : ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. టేపులగూడెం వద్ద 163 వ జాతీయ రహదారి నీట మునగడంతో పది రోజులుగా ఛత్తీస్‌గడ్ నుంచి వచ్చే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి. అంతర్రాష్ట్ర రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. భారీ గేట్స్ ఏర్పాటు చేసిన పోలీసులు అటుగా ఎవరు వాగు దాటకూడదని హెచ్చరికలు జారీ చేశారు.