Rains in AP Due to Cyclone Fengal :ఫెయింజల్ తుపాను ప్రభావం తగ్గినా పలు జిల్లాల్లో వానలు కురుస్తూనే ఉన్నాయి. కొన్ని చోట్ల వర్షాలకు పంటలు నీట మునిగాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పెద్ద సంఖ్యలో వరి పంటకు నష్టం వాటిల్లింది. మళ్లీ నారుమడులు వేసేందుకు ప్రభుత్వమే విత్తనాలు సరఫరా చేయాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో అధికారుల అలసత్వంతో ధాన్యం రైతులు అవస్థలు పడుతున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన హోంమంత్రి అనిత రైతుల్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఫెయింజల్ తుపాను కారణంగా నెల్లూరు జిల్లాలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మూడు రోజులుగా కురిసిన వర్షాలతో పంట పొలాల్లో నీరు నిలిచింది. కోవూరు, కొడవలూరు, విడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం, అల్లూరు మండలాల్లో వరి నారు దెబ్బతింది. కొన్నిచోట్ల పాచిపడుతోంది. అల్లూరు డెల్టా ప్రాంతంలోనే 400 ఎకరాల్లో నాట్లు దెబ్బతిన్నాయి. కోవూరు నియోజకవర్గంలోని 1.1 లక్షల ఎకరాల్లో వరి వేయగా 60 శాతం పొలాల్లో నీరు నిలబడి ఉంది. నీటిని బయటకు పంపించే మార్గం లేక ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ విత్తనాలు పోసుకుని, నార్లు వేయాలంటే తమ వల్ల కాదని ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
తీవ్ర వాయుగుండంగా మారనున్న తుపాను- పలు ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్లకు అవకాశం
తుపాను ప్రభావంతో కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లిలో ధాన్యం రైతులు అవస్థలు పడుతున్నారు. తేమ శాతం అధికంగా ఉందని చెబుతూ కొనుగోలు చేయట్లేదని, ఆరబోస్తే ఎండ రావట్లేదని అంటున్నారు. మిల్లర్లు కావాలనే ఇబ్బందులు పెడుతున్నారని, ప్రభుత్వం వేగంగా ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు.