Rains in Andhra Pradesh: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా వర్షం కురవడంతో ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఊరట లభించింది. అదే సమయంలో వర్షానికి చేతికి వచ్చిన పంట తడిచిపోవడంతో పలుచోట్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కోసూరువారిపాలెంలో మూడు రోజులుగా కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పొలంలో ఉన్న మొక్కజొన్న కండెలు వర్షానికి తడిచి మొలకలు వచ్చాయి.
ఎడతెరపి లేని వాన- ఉక్కపోత నుంచి ఉపశమనం - Rains Alert in Andhra Pradesh
కృష్ణా జిల్లా చల్లపల్లి మండలంలోని నడకుదురు, నిమ్మగడ్డ, ఘంటసాల మండలంలోని పాపవినాశనం, శ్రీకాకుళం గ్రామాల్లో సుమారు 200 ఎకరాల్లో మొక్కజొన్న పంట వర్షానికి తడిచి మొలకలు వచ్చింది. కోసూరువారిపాలెంలో కల్లాల్లోని వరి కుప్పలలోకి వర్షపు నీరుచేరి ధాన్యం మొలకెత్తింది. మరో రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దివిసీమలో ఇంకా సుమారు రెండు వేల ఎకరాల్లో వరి కుప్పలు నూర్పిడి చేయాల్సి ఉంది. వర్షాలు కురిస్తే వరి కుప్పల్లోకి నీరు చేరి నష్టం జరిగే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.