Heavy Rain in Hyderabad : భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం వేళ భారీ వర్షం కురిసింది. అమీర్‌పేట, బేగంపేట్, పంజాగుట్ట, సికింద్రాబాద్, జేబీఎస్, కోఠి, రాంకోఠి, కింగ్ కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ, హిమాయత్‌నగర్, హైదర్‌గూడ, నారాయణగూడ, చిక్కడపల్లి, ఫిలింనగర్, కవాడిగూడ, ఎల్బీనగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ సహా పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వాహనదారులు తడిసి ముద్దయ్యారు. పంజాగుట్టలో భారీ వర్షం కారణంగా నిమ్స్ ఆసుపత్రిలో వరద నీరు చేరి రోగులు అవస్థలు పడ్డారు. వాన దంచికొట్టడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్లపై ఎక్కడా నీరు నిలవకుండా చర్యలు చేపట్టారు.
హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం - రహదారులన్నీ జలమయం - Rain in Hyderabad - RAIN IN HYDERABAD
Rain in Hyderabad Today : నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం వేళ వర్షం దంచికొట్టింది. పలుచోట్ల వర్షపు నీరు రహదారులపైకి చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి ఎక్కడికక్కడ పరిస్థితులను చక్కబెట్టారు.
Published : Jun 6, 2024, 3:59 PM IST
|Updated : Jun 6, 2024, 7:07 PM IST
నేడు భారీ వర్షాలు :రాష్ట్రంలో రాగల 3 రోజులు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు మాత్రం కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. రేపు, ఎల్లుండి కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. ఈరోజు నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి మెదక్, భద్రాచలం గుండా వెళ్తుందని తెలిపారు. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని స్పష్టం చేశారు.
పిడుగుపాటుకు ఇద్దరు మృతి : నిర్మల్ జిల్లాలో పిడుగుపాటు కారణంగా ఓ యువ రైతు, బాలుడు మృత్యువాతపడ్డారు. దిలావర్పూర్ మండలంలోని కాల్వ గ్రామానికి చెందిన యువ రైతు ప్రవీణ్ (26) మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్యాంట్ జేబులో సెల్‌ఫోన్ పెట్టుకొని పొలంలో విత్తనాలు చల్లుతుండగా, ఒక్కసారిగా పిడుగుపడి అక్కడికక్కడే కుప్పకూలాడు. సమీపంలో ఉన్న రైతులు నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తానూర్ మండలం ఎల్వత్ గ్రామంలో పిడుగు పాటుకు 13 ఏళ్ల ఓ బాలుడు చనిపోయాడు.