Heavy Rain In Hyderabad :హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయి. గురువారం రాత్రి ఏకధాటిగా కురిసిన వానకు పలు ప్రాంతాల్లోని రోడ్లు నీట మునిగాయి. వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షం : సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చిలకలగూడ మార్కెట్, మారేడుపల్లి ప్యాట్నీ పారడైజ్, బేగంపేట్ ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తుంది. మరోవైపు కుత్బుల్లాపూర్ పరిసరాల్లో భారీ వర్షం కురుస్తుంది. గుండ్ల పోచం పల్లి, బహదూర్ పల్లి, పెట్ బషీరాబాద్, సుచిత్ర, జీడిమెట్ల, కొంపల్లి, చింతల్ , సూరారం, జగద్గిరిగుట్ట, బాలనగర్లో ఏకధాటిగా వర్షం పడుతుంది. వర్షానికి రహదారులన్నీ జలదిగ్బంధమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ప్రధాన మార్గాలు సహా కొన్ని బస్తీలు, కాలనీలు చెరువులను తలపించాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
రహదారుల పైకి మోకాళ్ళ లోతు వరద నీరు చేరడంతో పాదచారులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోండా మార్కెట్లో ఓ ఎలక్ట్రానిక్ దుకాణంలోకి వరద నీరు చేరడంతో వస్తువులు తడిసిపోయాయి. వరద నీటి కారణంగా ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. జీహెచ్ఎంసీ మాన్సూన్ బృందాలు రహదారులపై వరద నీరు భారీగా చేరడంతో నీటి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.