Railway Department Allocates Funds for Nandivelugu Bridge:ఆ ప్రాంతానికే ఎంతో కీలకమైన బ్రిడ్జిని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. గుత్తేదారుకు బిల్లులు చెల్లించక పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. పైవంతెన లేక ట్రాఫిక్‌లో చిక్కుకుని వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ప్రజల ఇబ్బందులపై దృష్టి సారించిన కూటమి సర్కార్ సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టింది. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక చొరవతో బ్రిడ్జి నిర్మాణానికి రైల్వేశాఖ 20 కోట్లు కేటాయించింది. బ్రిడ్జి పునఃనిర్మాణానికి మార్గం సుగమం కావడంతో ఏడాది చివరినాటికి పైవంతెన అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
పెమ్మసాని చొరవతో నంది'వెలుగులు' - కష్టాలు తీరతాయని ప్రజల ఆశాభావం (ETV Bharat) పాత గుంటూరు సమీపంలోని నందివెలుగు వద్ద పైవంతెన నిర్మాణం ఆ ప్రాంతవాసుల చిరకాల స్వప్నం. ఆర్వోబీ ఆవశ్యకతను గుర్తించిన తెలుగుదేశం ప్రభుత్వం గుంటూరు నుంచి నందివెలుగు వెళ్లే మార్గంలో రైల్వే గేటు స్థానంలో పైవంతెన నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. చెరిసగం పనులు పంచుకోవాలని రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చాయి. 2017లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 20 కోట్లు మంజూరు చేసింది. ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో టెండరు ద్వారా గుత్తేదారుని ఎంపిక చేసి పనులప్పగించారు. మరోవైపు రైల్వేశాఖ రంగంలోకి దిగి ట్రాక్‌కు ఇరువైపులా స్తంభాలు నిర్మించింది.
మహిళలకే కాదు పురుషులకూ పొదుపు సంఘాలు - తొలి విడతగా ఆ జిల్లాలో ఏర్పాటు
గాలికి వదిలేసిన ప్రభుత్వం: అయితే 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక గుత్తేదారులకు బిల్లులు నిలిపేసింది. చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తేనే మిగిలింది పూర్తి చేస్తానని గుత్తేదారు చెప్పినా జగన్ సర్కారు పట్టించుకోలేదు. దీంతో విసుగెత్తిపోయిన గుత్తేదారు పనులు ఆపేశారు. ఐదేళ్లలో పట్టాలకు ఇరువైపులా చేపట్టిన పనులు ఇంచు కూడా ముందుకు కదల్లేదు. ఆర్‌అండ్‌బీ పరిధిలో మొత్తం 21 స్లాబులకుగాను 5 స్లాబులతోపాటు పిల్లర్లు వేశారు. గత ప్రభుత్వ అలసత్వం కారణంగా నిర్మాణం పూర్తయిన కొద్ది ప్రాంతంలో గాలిలో తేలాడుతున్నట్లుగా వంతెన కనిపిస్తోంది. ఇరువైపులా సర్వీసు రోడ్ల నిర్మాణం డ్రెయిన్ పనులూ సగమే చేశారు. దీంతో ఈ మార్గంలో రాకపోకలంటేనే తలనొప్పి. గేటు పడితే చాలు ఇరువైపులా వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది.
కష్టాలు తీరతాయని ప్రజలు ఆశాభావం:ఆర్వోబీల విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉండటంతో గుంటూరులో శంకర్ విలాస్ కూడలి, రింగురోడ్డు వద్ద రెండు పైవంతెనలకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. ఇప్పుడు నందివెలుగు ఫ్లైఓవర్ పెండింగ్ పనులు పూర్తి చేయాలని రైల్వే అధికారులతో పెమ్మసాని మాట్లాడి ఒప్పించారు. దీంతో 20కోట్ల వ్యయాన్ని భరించేందుకు రైల్వే శాఖ అంగీకరించినట్లు ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులు తెలిపారు. ఇకపై తమ కష్టాలు తీరతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయి పనులు తిరిగి ప్రారంభించేందుకు మరో 2నెలలు సమయం పట్టే అవకాశముంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది చివర నాటికి పైవంతెన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.
కానిస్టేబుల్ అభ్యర్థి అతి తెలివి - ఉద్యోగం కోసం రిజల్ట్‌నే మార్చేశాడు
తిరుపతి తొక్కిసలాట ఘటన - న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశం