Railway Budget Allocation in Telangana 2024 :కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైల్వే శాఖకు చేసిన కేటాయింపుల్లో తెలంగాణకు ఊరట కలిగించే అంశాలేమీ లేవు. నూతన రైల్వే లైన్లు, రైల్వే టెర్మినల్, డబ్లింగ్, భారీ ప్రాజెక్టులేవీ మంజూరు కాలేదు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్నవి, పాత ప్రాజెక్టులకే నిధులు కేటాయించారు. గత సంవత్సరం రాష్ట్రానికి ఇచ్చిన రూ.4,418 కోట్లతో పోలిస్తే ఈసారి దాదాపు 12.8 శాతం పెంచి రూ.5,071 కోట్లు కేటాయించారు. తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్-గుంటూరు వయా నల్గొండ, మిర్యాలగూడ రెండో లైనుకు ఐదేళ్ల తర్వాత నిధులు కేటాయించడం కాస్త ఉపశమనమని చెప్పవచ్చు.
మధ్యతరగతికి నిర్మల గుడ్‌న్యూస్! ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం- ఐదేళ్లలో రెండు కోట్ల ఆవాసాలు
ఏ పథకంలో ఇస్తారో? :కీలకమైన సికింద్రాబాద్, అమృత్ భారత్ స్టేషన్ల పునరాభివృద్ధి పనులనుబడ్జెట్‌లో (Union Budget 2024) ప్రస్తావించలేదు. ఇందులో భాగంగా వీటికి నిధులు ఏ పద్దు కింద ఇస్తారో స్పష్టం కావాల్సి ఉంది. ముంబయి మార్గంలో కీలకంగా ఉన్న లింగంపల్లి-వికారాబాద్ సెక్షన్‌కు రెండో లైను మంజూరు కాలేదు. సర్వే పూర్తయిన కాజీపేట-హుజూరాబాద్-కరీంనగర్ ప్రతిపాదిత రైల్వే లైనూ మంజూరు చేయలేదు.
Union Budget 2024-2025 :ఘట్‌కేసర్-కాజీపేట వరకు మూడో లైను నిర్మిస్తే విజయవాడ, దిల్లీ వైపు రాకపోకలు సులభమవుతాయి. అయినా ఈ ప్రాజెక్టునూ పట్టించుకోలేదు. మరోవైపు నిర్మాణంలో ఉన్న మూడో లైను ప్రాజెక్టులకు ఈసారి నిధులు తగ్గాయి. హైదరాబాద్‌లో ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేలా నగరం చుట్టూ శంషాబాద్, నాగులపల్లి, మేడ్చల్ ప్రాంతాల్లో కొత్త టెర్మినళ్ల డిమాండ్‌ను పరిశీలించనే లేదు.
కొత్త రైల్వే లైన్లకు నిధులు :
- మనోహరాబాద్-కొత్తపల్లి : గత సంవత్సరం రూ.185 కోట్లు ఇచ్చారు. ఈసారి రూ.350 కోట్లు కేటాయించారు.
- మణుగూరు-రామగుండం : 2013-14లో మంజూరైన ఈ ప్రాజెక్టు నిడివి 200 కిలో మీటర్లు. పనుల జాప్యం వల్ల అంచనా వ్యయం రూ.1,112 కోట్ల నుంచి రూ.2,911 కోట్లకు పెరిగింది. గత సంవత్సరం రూ.10 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.5 కోట్లకే పరిమితం చేశారు.
- భద్రాచలం రోడ్-సత్తుపల్లి :ఈ రైల్వే లైను నిర్మాణం పూర్తయ్యింది. చిన్నపాటి పనుల కోలం రూ.6.12 కోట్ల కేటాయించారు.
- భద్రాచలం రోడ్-కొవ్వూరు : 2012-13లో మంజూరైంది. ఆలస్యంతో అంచనా వ్యయం రూ.1,445 కోట్ల నుంచి రూ.2,154.83 కోట్లకు పెరిగింది. ఇప్పుడు కేటాయించింది రూ.10 లక్షలే.