Radisson Drug Case Update :హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ కేంద్రంగా జరిగిన డ్రగ్స్ పార్టీలో సినీ ప్రముఖుల పేర్లు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు గజ్జల వివేకానంద్ నిర్వహించిన డ్రగ్స్ పార్టీ నిర్వహించగా, అదే సమయంలో సినీ దర్శకుడు క్రిష్(జాగర్లమూడి రాధాకృష్ణ) అక్కడకు హాజరైనట్లు పోలీసులు ధ్రువీకరించారు. నిందితుడు వివేకానంద్ సైతం పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో క్రిష్ హాజరైనట్లు చెప్పాడు.
క్రిష్ పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే క్రిష్‌ను ఫోన్ ద్వారా సంప్రదించి విచారణకు(Police Inquiry) రావాలని తెలిపారు. విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరవుతామని క్రిష్ బదులిచ్చారని, వైద్య పరీక్షలు నిర్వహించాక అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. హోటల్‌లో చాలాసార్లు పార్టీలు చేసుకున్నట్లు నిందితులు చెప్పారని, పార్టీల్లో డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పాల్గొన్నారో లేదో పూర్తిగా నిర్ధరణ కాలేదని స్పష్టం చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు మాదాపూర్ డీసీపీ వినిత్ వెల్లడించారు.
"రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ కేసులో దర్యాప్తు చేస్తన్నాం. నిందితుల బ్లడ్ శాంపిల్స్ పరీక్షిస్తే డ్రగ్స్ పాజిటివ్‌గా వచ్చాయి. హోటల్‌లో చాలాసార్లు పార్టీలు చేసుకున్నట్లు నిందితులు చెప్పారు. పార్టీలో క్రిష్ పాల్గొన్నారో లేదో పూర్తిగా నిర్ధరణ కాలేదు. వివేకానంద్‌కు క్రిష్‌కు పరిచయం ఎన్నాళ్లుగా ఉందో తెలియదు. నిందితులు డ్రగ్స్ ఎక్కడి నుంచి తెస్తున్నారో దర్యాప్తు చేస్తున్నాం."-వినిత్, మాదాపూర్ డీసీపీ
గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో మంజీర గ్రూప్ డైరెక్టర్ అరెస్ట్ - 9 మందిపై కేసు నమోదు
Gachibowli Drugs Case :మాదాపూర్ ఎస్‌ఓటీ, గచ్చిబౌలి పోలీసులు గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ పార్టీ నిర్వహించారనే సమాచారంతో ఆదివారం అర్థరాత్రి తర్వాత సోదాలు చేసి మంజీరా గ్రూపు సంస్థల డైరెక్టర్ గజ్జల వివేకానంద్, నిర్భయ్, కేదార్‌నాథ్‌ను అరెస్టు చేశారు. ఈ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న రఘుచరణ్, సందీప్, నీల్, శ్వేత, యూట్యూబర్ లిషి, డ్రగ్స్ సరఫరాదారు సయ్యద్ అబ్బాస్ అలీ జాఫ్రీ పరారయ్యారు. ఈ కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు సోమవారం అబ్బాస్ అలీ జాఫ్రీని అదుపులోకి తీసుకున్నారు.
అబ్బాస్ గతంలో మంజీరా గ్రూపు సంస్థలో పనిచేసి ఉద్యోగం మానేశాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత కూడా వివేకానంద్‌తో సంబంధాలు కొనసాగించాడని, ఆ పరిచయంతోనే అబ్బాస్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్నట్లు తేలిందని వివరించారు. డ్రగ్స్ పార్టీలో(Drugs Party) పాల్గొన్న రఘుచరణ్ బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విచారణకు హాజరవుతాననీ తెలిపినట్లు పేర్కొన్నారు. పార్టీ జరిగిన రోజు దర్శకుడు క్రిష్ సైతం అక్కడే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదే విషయాన్ని వివేకానంద కూడా పోలీసుల ముందు తెలిపాడు. వీరితో పాటు పరారీలో ఉన్న వారందరినీ అరెస్ట్ చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.