PV Narasimha Rao Profile : రాజకీయాలకతీతంగా తెలుగు రాష్ట్రాల నాయకులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. భారత మాజీ ప్రధాన మంత్రి, తెలంగాణ ముద్దుబిడ్డ పాములపర్తి వెంకట నరసింహారావు ( పీవీ నరసింహారావు)కు కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించింది. పీవీతో పాటు మరో మాజీ ప్రధఆని చౌదరి చరణ్‌సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్‌కు ఎన్డీఏ సర్కార్ భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. పీవీకి భారతర్న ప్రకటించడంపై తెలుగు రాష్ట్రాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
PV Narasimha Rao Political Career :పీవీ నరసింహారావు 1921వ సంవత్సరంలో జూన్ 28వ వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి (అప్పటి కరీంనగర్ జిల్లా)లో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ, బాంబే, నాగ్‌పుర్ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు. స్వాతంత్రోద్యమం సమయంలో దేశం కోసం పోరాడిన పీవీ ఆ తర్వాత కాంగ్రెస్ సభ్యుడిగా చేరి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కేంద్రంలో మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ ప్రభుత్వాల్లో పని చేశారు. హోం, రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా పేరు తెచ్చుకున్న పీవీ, ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని రక్షించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.
పీవీ సేవలందించిన మరికొన్ని పదవులు ఇవే
- 1962-64 కాలంలో న్యాయ, సమాచార శాఖల మంత్రి
- 1964-67 మధ్యలో న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి
- 1967లో వైద్యారోగ్య శాఖ మంత్రి
- 1968-71లో విద్యాశాఖ మంత్రిగా
- 1971-73 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా
- 1968 -74 ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ఛైర్మన్
- 1975-76 వరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి
- 1972 నుంచి మద్రాస్‌లో దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఉపాధ్యక్షుడు
- 1957 – 77 మధ్య ఎమ్మెల్యే (ఆంధ్రప్రదేశ్)
- 1977 నుంచి 1984 వరకు ఎంపీ
- 1984 డిసెంబర్‌లో మరోసారి ఎంపీ
- 1980 - 984 విదేశాంగ మంత్రి
- 1984 -1985 రక్షణ మంత్రి
- 1985 మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి
- 1991 నుంచి 1996 వరకు భారత ప్రధాన మంత్రి
పీవీకి భారతీయ తత్వశాస్త్రం, సంస్కృతి, కవితలు, రాజకీయ వ్యాఖ్యానాలు రాయడం, భాషలు నేర్చుకోవడం, తెలుగు,హిందీ భాషల్లో కవితలు రాయడం, సాహిత్యానికి దగ్గరగా ఉండటం అంటే చాలా ఇష్టం. స్వర్గీయ విశ్వనాథ సత్యనారాయణ నవల వేయి పడగలు హిందీ అనువాదాన్ని ‘సహస్రఫణ్’ పేరుతో ఆయన రచించారు. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించిన స్వర్గీయ శ్రీహరినారాయణ్ అప్టే ప్రముఖ మరాఠీ నవల ‘పన్ లక్షత్ కోన్ గెటో’ తెలుగు అనువాదాన్ని కూడా ప్రచురించారు. మరాఠీ నుంచి తెలుగులోను, తెలుగు నుంచి హిందీలోను అనేక అనువాద గ్రంథాలు పబ్లిష్ చేశారు. వివిధ పత్రికల్లో కలం పేరుతో అనేక వ్యాసాలు రాశారు. విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో పీవీ నరసింహారావు అంతర్జాతీయ దౌత్యానికి సంబంధించి తన ప్రజ్ఞా పాటవాలను, రాజకీయ అనుభవాన్ని సమయోచితంగా ప్రదర్శిస్తూ వచ్చారు.