తెలంగాణ

telangana

ETV Bharat / state

సంస్కరణల రుషికి భారతరత్న - అప్పుల భారతాన్ని ప్రగతివైపు నడిపిన 'పీవీ' - Bharat Ratna PV Narasimha Rao Story

PV Narasimha Rao Economic Reforms : ఇప్పుడు ఎన్నో అంకురసంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రైవేట్ ఈక్విటీ, సూక్ష్మరుణాలు, కొత్త సాంకేతికతలు అందుబాటులోకి వస్తున్నాయి. మొత్తంగా జీవనశైలి మారింది. ఇది ఒక్కరాత్రిలో జరిగింది కాదు. ఇదంతా సాధ్యం చేసింది.. కొత్త శకానికి నాంది పలికింది పీవీ. మనం అనుభవించే ప్రతి సౌకర్యం వెనక ఎంతో మేధో యుద్ధం, అంతర్మథనం దాగుంటాయి అంటారు. పీవీ తెచ్చిన సంస్కరణలు చూస్తే అది నిజమే అని నమ్మి తీరాల్సిందే. ఒక్కో తరానికి ఒక్కో మార్గదర్శి ఉద్భవిస్తాడు. భవిష్యత్​లో వచ్చే తరతరాలకూ పీవీనే మార్గదర్శి. ఆయన తెచ్చిన ఆర్థిక సంస్కరణలు ఆదర్శం, ఆచరణీయం. పీవీకి భారతరత్న పురస్కారం లభించిన సందర్భంగా 'ఈటీవీ భారత్'​ అందిస్తున్న ప్రత్యేక కథనం.

PV Narasimha Rao Economic Reforms
PV Narasimha Rao

By ETV Bharat Telangana Team

Published : Feb 9, 2024, 2:21 PM IST

PV Narasimha Rao Economic Reforms : లైసెన్స్‌ - పర్మిట్‌రాజ్‌ బంధనాల నుంచి ఆర్థిక వ్యవస్థను విముక్తి చేసి భారత్‌ను అంతర్జాతీయ పోటీ విపణిలో ముందు వరసలో నిలిపిన దీర్ఘదర్శి పీవీ. ఆర్థిక సంస్కరణలను దేశానికి పరిచయం చేసింది ఆయనే. స్వాతంత్య్రం తర్వాత అయిదు దశాబ్దాలు ఎదుగుబొదుగు లేకుండా.. అభివృద్ధి రేటులో దిగబడిపోయిన ఆర్థిక రథాన్ని ప్రగతిపథంలో పరుగులు తీయించారు పీవీ. ఆర్థిక సరళీకరణలో అప్పటి ఆర్థికమంత్రి మన్మోహన్‌సింగ్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చి సమర్థ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. నిజాయతీ, సమర్థత ఉన్న వారిని ఏరికోరి ఉన్నతస్థానాల్లో నియమించి ప్రతిభకే పట్టం అనే గట్టి సందేశాన్నీ పంపారు.

1991లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టేనాటికి దేశం పూర్తిగా అప్పుల ఊబిలో మునిగిపోయి ఉంది. ఎటు చూసినా సవాళ్లే. అలాంటి ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిన పెట్టాల్సిన బాధ్యత.. పీవీపైనే పడింది. ఆయన ప్రధానమంత్రిగా వచ్చేనాటికి దేశంలో విదేశీ మారక నిల్వలు దాదాపుగా నిండుకున్న పరిస్థితి. అలాంటిది ఆయన దిగిపోయే నాటికి చాలా విషయాల్లో భారత్‌ తిరిగి చూసుకునే అవసరం లేకుండా చేశారు. విదేశీ రుణం కోసం బంగారాన్ని విమానాల్లో తరలించాల్సిన దైన్యం నుంచి విదేశీ పెట్టుబడులు వెల్లువలా వచ్చేందుకు మార్గం సుగమం చేశారు. అందుకోసం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఏ నిర్ణయానికీ రాజకీయంగా అవరోధాలు లేకుండా చూశారు పీవీ.

పారిశ్రామికరంగం కొత్తరూపు

లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి ఆధిక్యం లేని పరిస్థితుల్లో చేపట్టిన సంస్కరణల యజ్ఞాన్ని ఎక్కడా గాడి తప్పకుండా చూసుకున్నారు. పీవీ సంస్కరణలు, సామాజిక సవాళ్ల మధ్య సమన్వయం సాధిస్తూ ఫలితాలు రాబట్టారు . విమర్శలకు తనే సమాధానం ఇచ్చేవారు. ఫలితాలు కొన్నాళ్లకు ఒక్కొక్కటిగా అందివచ్చాయి. రూపాయి విలువ పెరిగింది. ఎగుమతుల సబ్సీడీ తగ్గి వేలకోట్లు ఆదా అయ్యాయి. ఎగుమతుల ఆదాయాలు పెరిగాయి. విదేశీమారక నిలువలు సమకూరి ద్రవ్యోల్బణ రేటు తగ్గింది. ద్రవ్యలోటు అదుపులోకి వచ్చింది. పారిశ్రామికరంగం కొత్తరూపు సంతరించుకుంది.

రావు-మన్మోహన్ నమూనా

స్వేచ్ఛా వాణిజ్యానికి ద్వారాలు తెరిచారు పీవీ. ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ చొరవతో మరెన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారు. అందుకే వీటిని రావు-మన్మోహన్ నమూనా అని కూడా పిలుస్తారు. ఈ సంస్కరణల ఫలితంగా... తను ప్రధానిగా వచ్చేనాటికి మూడు వారాల దిగుమతుల బిల్లు కూడా బొటాబొటీ నిధులతో ఉన్న దేశం తిరిగి నిలదొక్కుకుంది. విదేశీ అప్పులు చెల్లించలేక చేతులు ఎత్తేసే ప్రమాదాన్ని తప్పించారు. వేగంగా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ - ఎల్​పీజీ విధానం అమలు చేశారు. ద్రవ్య క్రమశిక్షణ, వాణిజ్య విధానాల సంస్కరణలు, పారిశ్రామిక విధానంలో మార్పులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో దిద్దుబాటు అనే 4 ప్రధాన సూత్రాల ఆధారంగా పని చేశారు.

లైసెన్స్‌ విధానానికి చెల్లుచీటి

అంతర్జాతీయంగా భారత రేటింగ్‌ను పెంచేందుకు ద్రవ్యలోటును కట్టడి చేయటంపై ముందుగా దృష్టి సారించారు. ప్రభుత్వ రంగ పరిధి తగ్గించారు. పారిశ్రామిక లైసెన్సులు ఎత్తివేయటం, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించటం, వృద్ధిరేటు పెంపు, ప్రాంతీయ అసమానతలు తగ్గించే లక్ష్యాలతో ఈ సంస్కరణలు తీసుకొచ్చారు. ఎగుమతులపై రాయితీల్లో కోత పెట్టడమే కాదు భారత్‌ ఉత్పత్తుల్ని పోటీలో నిలిపేందుకు ఏకంగా 20శాతం మూల్యహీనీకరణ చేశారు. 18 సున్నితమైన అంశాలకు సంబంధించి పరిశ్రమలు మినహా... లైసెన్స్‌ విధానానికి చెల్లుచీటి రాశారు. దేశీయంగా పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించే ప్రభుత్వం ఉందన్న నమ్మకాన్ని కల్పించారు. వ్యాపార అనుకూల విధానాలను మరింతగా ప్రోత్సహించారు. విదేశీ మారక నియంత్రణ చట్టం ఎఫ్​ఈఆర్​ఏను సడలిస్తూ, విదేశాల్లో భారతీయులు జరిపే లావాదేవీల విషయంలో స్వేచ్ఛ పెంచారు.

ప్రైవేటీకరణ ప్రక్రియకు పెద్దపీట

పీవీ నూతన ఆర్థిక విధానం ప్రైవేటీకరణ ప్రక్రియకు పెద్దపీట వేసింది. పబ్లిక్‌ రంగ సంస్థల యాజమాన్యం, ఆస్తులు ప్రైవేటుపరం చేయడం వల్ల సంస్థ యాజమాన్య సామర్థ్యం మెరుగుపడి, ఆర్థిక సమర్థత పెరుగుతుందన్న వాదం బలపడింది. ప్రైవేటీకరణలో భాగంగానే ప్రభుత్వరంగ సంస్థల్లోని పెట్టుబడుల ఉపసంహరణ విధానం రూపొందించారు. వాణిజ్య అవరోధాలు తగ్గించి, వివిధ దేశాల మధ్య వస్తుసేవల ప్రవాహానికి ఉన్న ఇబ్బందులను తొలగించేలా ప్రపంచీకరణ విధానం అమలు చేశారు. సాంకేతిక విజ్ఞానం అందిపుచ్చుకునేందుకు అనుకూల వాతావరణం కల్పించడమూ ఈ విధాన లక్ష్యం. ఇలా...అన్ని విధాలా స్వేచ్ఛాయుత వాణిజ్య విధానానికి రూపకల్పన చేసి.. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడుగా నిలిచారు పీవీ నరసింహారావు.

ABOUT THE AUTHOR

...view details