Pulivendula Police Issued 41 A Notice To Sajjala Bhargav Reddy :సజ్జల భార్గవ్‌రెడ్డితో పాటు జగన్ బంధువు అర్జున్‌రెడ్డికి వైఎస్సార్ జిల్లా పోలీసులు 41-A నోటీసులు జారీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టుల కేసులో వైఎస్సార్సీపీ కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు వీరిద్దరికి పులివెందుల పోలీసులు 41-A నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు రావాలని పేర్కొన్నారు. వీరితో పాటు మరికొంత మంది వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు సైతం విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.
సోమవారం విచారణ :ఈ నెల 8న వైఎస్సార్సీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డిపై నమోదైన కేసులో అనేక మంది ఆ పార్టీ సామాజిక మాధ్యమ కార్యకర్తలకు వైఎస్సార్ జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ కేసులో A1గా వర్రా రవీందర్‌రెడ్డి, A2గా సజ్జల భార్గవరెడ్డి, A3 అర్జున్‌రెడ్డిల పేర్లు చేర్చారు. అయితే ఇప్పటికే వర్రా రవీందర్‌రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ మీద కడప జైలుకు తరలించారు. తాజాగా కేసులో A2 సజ్జల భార్గవరెడ్డికి 41-A నోటీసులు జారీ చేశారు. విజయవాడకు వెళ్లిన పోలీసులు ఆయన ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో సజ్జల భార్గవ్ తల్లికి నోటీసులు అందజేశారు. అలాగే పులివెందులకు చెందిన జగన్ బంధువు అర్జున్‌రెడ్డికి కూడా పోలీసులు 41-A నోటీసులు జారీ చేశారు. ఆయన కూడా ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించి వచ్చారు. వీరిద్దరు సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విదేశాలకు పారిపోతారనే అనుమానంతో ఇప్పటికే వీరిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
"ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారో?" - అజ్ఞాతంలోకి 'పులివెందుల' వైఎస్సార్సీపీ నేతలు
తాజాగా ఇద్దరిని విచారించాలనే ఉద్దేశంతో వారు అందుబాటులో లేకపోవడంతో ఇళ్లకు వెళ్లి నోటీసులు అంటించి వచ్చారు. వర్రా రవీందర్‌రెడ్డి పోలీసు విచారణ సందర్భంగా ఇచ్చిన వాంగ్మూలం మేరకు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టించడంలో రాష్ట్ర స్థాయి బాధ్యతలు చేపడుతున్న సజ్జల భార్గవరెడ్డి కీలకమైన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. అతనిపైన పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో అతడ్ని విచారించి అరెస్ట్ చేయాలని కూడా యోచిస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర స్థాయి సామాజిక మధ్యమ నేతగా ఉన్న అర్జున్‌రెడ్డికి నోటీసులు అందజేశారు.