Pulivarthi Nani Case Update 11 Arrest : చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితులు భానుకుమార్‌రెడ్డి, గణపతిరెడ్డితోపాటు మరో 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 13 మందికి తిరుపతి ఏడీజే కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. నిందితులందర్నీ చిత్తూరు సబ్ జైలుకు పోలీసులు తరలించారు. పులివర్తి నానిపై పోలింగ్ మరుసటి రోజు 14వ తేదీన హత్యాయత్నం జరిగింది. పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లిన నానిపై వైఎస్సార్సీపీ మూకలు దాడికి తెగబడ్డారు. పులివర్తి నానిపై మారణాయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో త్రుటిలో ప్రాణాపాయం నుంచి పులివర్తి నాని తప్పించుకున్నారు. ఈ ఘటనలో నానితో సహా ఆయన భద్రతా సిబ్బందికి గాయాలవ్వగా, కారు ధ్వంసమైంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి పంపారు.
పథకం ప్రకారమే వైఎస్సార్సీపీ మూకలు తనను హత్య చేసేందుకు యత్నించాయని పులివర్తి నాని తెలిపారు. తాను ఈవీఎం స్ట్రాంగ్ రూముల పరిశీలనకు వెళుతున్న సమాచారం రిటర్నింగ్ అధికారికి మాత్రమే తెలియజేశానని, అదే సమయంలో అధికార పార్టీ గూండాలు ఆ ప్రాంతానికి ఎలా చేరుకున్నారని ప్రశ్నించారు. ముందస్తు ప్రణాళిక లేకుండా దాడి జరిగే అవకాశం లేదని తెలిపారు. రిటర్నింగ్ అధికారితో పాటు కొందరు పోలీసు అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తొత్తులుగా వ్యవహరించడంతోనే తనపై దాడి జరిగిందని స్పష్టం చేశారు. రిటర్నింగ్ అధికారిపై తమకు నమ్మకం లేదని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని పులివర్తి నాని చెప్పిన సంగతి తెలిసిందే.