TDP Grievance in Mangalagiri :గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ అరాచకాల వల్ల నష్టపోయిన బాధితులు పోటెత్తడంతో కార్యాలయం కిక్కిరిసిపోయింది. తమ సమస్యలను వారు దరఖాస్తుల రూపంలో నేతలకు అందించారు. ఈ క్రమంలోనే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి వారి అనుచరుల అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలతో ఐదేళ్లుగా నరకం అనుభవించామని మాచర్ల నియోజకవర్గానికి చెందిన బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
Heavy Applicants toTDP Grievance Program : పుట్టిన ఊళ్లకు దూరంగా దిక్కులేని వారిగా బతికామని బాధితులు నేతలకు తెలిపారు. బంధువుల ఇళ్లలో శుభకార్యాలకు వస్తే ఎక్కడ చంపుతారో అనే భయంతో బిక్కుబిక్కుమంటూ బతికామని వాపోయారు. పరారీలో ఉన్న వెంకట్రామిరెడ్డిని పట్టుకోవాలని, వారి అండ చూసుకొని పల్నాడును రావణకాష్టంలా మార్చిన వైఎస్సార్సీపీ వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమస్యలు తెలుసుకున్న నేతలు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి అధికారులతో నేతలు ఫొన్లో మాట్లాడి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.
మరోవైపు దక్షిణాఫ్రికాలో మోసపోయిన తన కుమారుడు ముప్పారాజు హరికృష్ణకు న్యాయసాయం అందించాలని ఇంకొల్లుకు చెందిన శ్రీనివాసరావు కోరారు. దక్షిణాఫ్రికాలో స్థానిక భారత సంతతి వ్యక్తి తన కుమారుడ్ని వేధిస్తున్నాడని చెప్పారు. దౌర్జన్యంగా రూ.80 లక్షల విలువైన బోర్లు వేసే డ్రిల్లింగ్ మిషన్, ట్రక్కు, కారు తదితర వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీనిపై దక్షిణాఫ్రికా కోర్టులు తమకు అనుకూలంగా తీర్పు చెప్పినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. ఈ విషయంపై భారత దౌత్య అధికారులతో మాట్లాడి న్యాయం చేయాలని శ్రీనివాసరావు వారికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన పల్లా శ్రీనివాసరావు బాధితుడికి సాయం చేయాల్సిందిగా బాపట్ల జిల్లా కలెక్టర్‌ని ఆయన కోరారు.