Sangareddy Bike Servicing Issue : సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురంలో ఓ వినియోగదారుడు తన ద్విచక్ర వాహనానికి ఓలా మోటారు సంస్థ సర్వీసింగ్ చేయకుండా తిప్పించుకుంటుందని ఆ సంస్థ విక్రయ కేంద్రం డోర్‌కు చెప్పుల దండ వేసి వినూత్న నిరసన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే సంగారెడ్డికి చెందిన సంతోష్ కుమార్ ఓలా మోటార్ సంస్థ నుంచి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేశాడు. కొద్దిరోజుల తర్వాత దానిని సర్వీసింగ్ చేయించాలని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం అశోక్‌నగర్‌లో ఉన్న షోరూం సర్వీస్ సెంటర్‌కు తీసుకొచ్చాడు. తర్వాత రెండు, మూడు సార్లు వెళ్లినా సర్వీస్ సెంటర్ సిబ్బంది వెహికల్ ఇవ్వలేదు. అడిగితే సరిగా స్పందించలేదు.
బైక్ సర్వీసింగ్‌కు ఇస్తే ఆలస్యం చేశారని సీరియస్ - షోరూం సెంటర్‌కు చెప్పుల దండ వేసిన కస్టమర్ - OLA BIKE SERVICING ISSUE SANGAREDDY
ఓలా బైక్ షోరూం డోర్‌కు చెప్పులదండ వేసిన కస్టమర్ - బైక్ సర్వీసింగ్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన
Published : Nov 8, 2024, 5:25 PM IST
|Updated : Nov 8, 2024, 5:32 PM IST
షోరూం సిబ్బంది తన బైక్ సర్వీసింగ్ చేయకుండా కొన్ని నెలలుగా తిప్పించుకుంటున్నారని విసుగు చెందిన సంతోష్ కుమార్ ఇవాళ షోరూం గ్లాస్ డోర్‌కు చెప్పుల దండ వేసి నిరసన తెలిపాడు. ఓలా సంస్థను బ్యాన్ చేయాలంటూ కరపత్రాలను ప్రదర్శించాడు. ఈ నేపథ్యంలో విక్రయ కేంద్రం ప్రతినిధులకు, సంతోష్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. తనను కొన్ని నెలలుగా తిప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప తన బైక్‌ను సర్వీసింగ్ చేయడం లేదని సంతోష్ మండిపడ్డాడు. ఓపిక నశించే ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపాడు. తాను కొత్త ద్విచక్ర వాహనం తీసుకున్న సమయంలో కూడా ఇదే మాదిరిగా ఆలస్యం చేశారని వాపోయాడు. ఈ వ్యవహారంపై షోరూం సిబ్బంది స్పందించాల్సి ఉంది.
మరోవైపు ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లకు మార్కెట్లో డిమాండ్ బాగానే ఉంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ బైక్‌ల విభాగంలో ఓలానే నెంబర్ వన్. అయితే సర్వీస్ విషయంలో చాలా చోట్ల ఫిర్యాదులు కూడా వచ్చాయి. సర్వీస్ సరిగా లేదని, ఆలస్యం చేస్తున్నారని చాలాచోట్ల కస్టమర్లు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి కంప్లైంట్స్ 10వేలకు పైగా వచ్చాయి. ఫిర్యాదులు రోజురోజుకు పెరిగి పోతుండటంతో గత నెలలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఓలా సర్వీస్ సెంటర్ల అడిట్కు ఆదేశించింది.