Prof Raghu Murtugudde Interview on Climate Changes : గ్రీన్ హౌస్ ఉద్గారాలు అనేవి సమస్త భూ మండలాన్ని నాశనం చేస్తాయి. ఎందుకంటే ఈ వాయువులు వాతావరణంలో వేడిని పెంచేసి వాతావరణ మార్పులను కారణమవుతున్నాయి. అందుకే ఈ మధ్యకాలంలో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
ముఖ్యంగా వీటి దెబ్బకు దక్షిణాది రాష్ట్రాల్లో వేడిమి పెరిగి జంతుజీవాలు విలవిలలాడుతున్నాయి. అయితే ఈ వాతావరణంలో విపరీతమైన వేడికి గల కారణాలేంటి? అధిక ఉష్ణోగ్రతలతో వాతావరణంలో మార్పులు ఎలా ఉంటాయి? ఎల్నినో ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు? వ్యవసాయ ఉత్పత్తిపై వాతావరణ మార్పుల ప్రభావం ఏ మేరకు ఉంటాయి? అనే అంశాలపై ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త, ముంబయి ఐఐటీ ప్రొఫెసర్ రఘు ముర్తుగుద్దె ఈటీవీ భారత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
వరల్డ్ టెంపరేచర్ రికార్డులను బద్దలుకొట్టిన '2023'- ఇది ప్రపంచానికి రెడ్ అలర్ట్!
ఎందుకింత వేడి - దీనికి కారణాలు ఏంటి?:కాలాలకు అనుగుణంగా వాతావరణంలో వేడి పెరగడం సాధారణ ప్రక్రియే. మార్చి, ఏప్రిల్, మే మాసాలలో కొన్నిసార్లు జూన్‌లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. వర్షాకాలం వాటిని చల్లబరుస్తుంది. కానీ సాధారణ కంటే వర్షాలు తక్కువగా కురిసినప్పుడు మాత్రం వాతావరణం వేడిగా ఉంటుంది. ఎడారి ప్రాంతాలు, వెచ్చటి వాతావరణం ఉండే సముద్రాలు, కొన్నిసార్లు స్థానిక పరిస్థితులతో వాటిల్లే మార్పుల ఫలితంగా అధిక ఉష్ణోగ్రతలకు అవకాశాలు ఉంటాయి. దేశంలో పలుచోట్ల ఇప్పుడు అలాంటి పరిస్థితుల్ని చూస్తున్నాం. 10 సంవత్సరాలకు ఓసారి జరిగే వాతావరణ మార్పులు కొన్నిసార్లు మూడు సంవత్సరాలకే వస్తున్నాయి.
అధిక ఉష్ణోగ్రతలతో వాతావరణంలో మార్పులు ఎలా ఉంటాయి?:గ్రీన్‌హౌస్ వాయువులు పెరగడం కూడా వాతావరణ మార్పులకు దారితీస్తుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. నీటి ఆవిరి అధికం అవుతుంది. వాతావరణంలో తేమ కూడా పెరుగుతుంది. గాలులు సైతం అధిక ఉష్ణోగ్రతలకు కారణం అవుతాయి. మధ్య తూర్పు దేశాల్లో వాతావరణం వేడిగా ఉంటుంది. దాంతో అరేబియా సముద్రం వెచ్చగా ఉంటుంది. ఆ కారణాలతో మనదేశంలోని చాలా ప్రాంతాల్లో వేడి పెరుగుతోంది. అటవీ ప్రాంతాల్లో చెట్లు నరికివేస్తుండటం కూడా ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమే. చెట్లను కాపాడుకోవాలి. పెద్ద సంఖ్యలో మొక్కలను నాటాలి.