School Problems in Sangareddy District : సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్‌ఖాన్‌పేట్‌లోని ప్రాథమిక పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. మెుత్తం ఐదు గదులుండగా వాటిలో ఒక గది మాత్రమే కొంత మేర బాగుంది. మిగిలిన గదులు పూర్తిగా గోడలు బీటలువారి పెచ్చులూడి పడుతున్నాయి. వర్షం పడినప్పుడు వాటిలోనించి వాననీరు తరగతి గదుల్లోకి వస్తోంది. బ్లాక్ బోర్డులు మసకబారిపోయాయి. గోడలు నాచుపట్టిపోయి మురికి వాడను తలపిస్తోంది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఉపాధ్యాయులు గదులకు తాళాలు వేయించారు. ప్రత్యామ్నయ మార్గం చూపితేనే ఈ విద్యాసంవత్సరం విద్యార్థుల చదువు సజావుగా సాగుతుంది.
ఈ పాఠశాలలో ఐదో తరగతి వరకు 75 మంది విద్యార్థులు ఉన్నారు. తరగతి గదులు శిథిలావస్థకు చేరుకున్నారు. కాస్తోకూస్తో బాగున్న గదిలోనే ఉపాధ్యాయులు అన్ని తరగతుల విద్యార్థులను కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. దీంతో ఒకటి నుంచి ఐదు తరగతుల చిన్నారులు ఒకే గదిలో విద్యను నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ తరగతిలో ఏ పాఠం జరుగుతుందో అర్థం కాని దుస్థితి. విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేయడానికి కూడా సరైన స్థలం లేక నిలబడే తింటున్నారు. ఈ గందరగోళం నడుమ చిన్నారుల చదువులు అస్తవ్యస్థంగా తయారవుతున్నాయి.
పాఠశాల ఆవరణ మొత్తం ప్రమాదాలే : ఇస్మాయిల్‌ఖాన్‌పేట్‌లోని పాఠశాలకు తమ చిన్నారులను పంపడానికే తల్లిదండ్రులు భయపడుతున్నారు. పాఠశాల ఆవరణం మెుత్తం ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందుతున్నారు. వర్షపునీరు తరగతి గదుల్లో చేరడటంతో ఈగలు, దోమలకు ఆవాసంగా మారుతున్నాయి. దీంతో విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాల ఆవరణం మెుత్తం చెత్త, పిచ్చిమెుక్కలతో చూడడానికి దయానీయ పరిస్థితుల్లో ఉంది.