TIDCO housing beneficiaries Allegations:పట్టణ పేదలకు అన్ని సౌకర్యాలతో కూడిన ఇల్లు ఇస్తున్నాం, పేదల సొంతింటి కల సాకారమైందంటూ, లబ్ధిదారులకు ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలు ఇచ్చి ప్రభుత్వం హడావుడి చేసింది. సొంతిల్లు కల సాకారమైందన్న ఆనందంతో టిడ్కో గృహ సముదాయానికి వెళ్లిన లబ్ధిదారులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఇల్లు అప్పగించినందున బ్యాంకు వాయిదాలు లబ్ధిదారులే చెల్లించాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు ఇళ్లలోకి వెళ్లి నివాసం ఉండలేని పరిస్థితులు ఉండటంతో ఇటు అద్దెలు, అటు బ్యాంకు వాయిదాలు కట్టడం వారికి భారమవుతోంది. నాలుగేళ్లుగా మౌలికవసతులు కల్పిస్తున్నామని మాటలు చెప్పిన ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా ఇల్లు అప్పగించడం మినహా పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించకపోవడం విఫలమైంది.
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ అలాస్యానికి కారణమెంటీ : సుప్రీం కోర్టు
సమస్యలతో స్వాగతం: పట్టణ పేదలకు నిర్మించిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అప్పగించి అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గుంటూరు నగరంలోని పేదలకు అడవితక్కెళ్లపాడు గృహసముదాయంలో మూడు విభాగాల్లో కలిపి 4వేల 192 ప్లాట్లు, వెంగళాయపాలెం గృహసముదాయంలో మొత్తం 1,888 ప్లాట్లు ఈనెల 6న లబ్దిదారులకు అప్పగించారు. నివాసయోగ్యంగా ఉన్నందున వెంటనే అందులో నివాసాలు ఉండవచ్చని ప్రకటించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన గృహ సముదాయాల్లో పిచ్చిమొక్కలు పెరిగాయి. విద్యుత్తు సౌకర్యం ఇంటింటికి ఇప్పుడిప్పుడే కనెక్షన్లు ఇస్తున్నారు. కొన్ని ఇళ్లకు ఇంకా నీటిసౌకర్యం ఏర్పాటుకాలేదు. అడవితక్కెళ్లపాడు గృహసముదాయంలో కొన్ని భవనాల్లో సివిల్ పనులు జరుగుతున్నాయి. భూగర్భమురుగునీటిపారుదల వ్యవస్థ మరమ్మతు పనులు చేస్తున్నారు. అడవితక్కెళ్లపాడు సముదాయానికి ప్రధాన రహదారి సైతం ఇంకా నిర్మాణంలోనే ఉంది. ఐదేళ్ల కిందట నిర్మించిన సముదాయంలో ఎలక్ట్రికల్ వస్తువులు, కిటికీలు తదితర సామగ్రి చోరీకి గురయ్యాయి. కిటికీల అద్దాలు పగిలిపోయాయి. అంతర్గతంగా ఒక బ్లాక్‌కు రహదారి కూడా నిర్మించలేదు. సముదాయం చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి విషపురుగులకు ఆవాసంగా మారాయి.