Extra Charges in Special Buses for Sankranthi : సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు పట్టణాల్లోని వారంతా పల్లెలకు చేరుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈ రోజు శనివారం ఆఫీసులకు సెలవు రావడంతో అందరూ సంక్రాంతికి ఊర్లకు బయలు దేరుతున్నారు. ముఖ్యంగా నగరంలో ఉంటున్న ఏపీ వారు తప్పకుండా ఊరెళ్తారు. దీంతో నగరంలోని రోడ్లన్నీ రద్దీగా మారాయి. కానీ బస్సుల్లో ఊరెళ్లే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. అటు ఆర్టీసీ ప్రత్యేక ఛార్జీలు అంటూ ధరలు పెంచడం, ఇటు రైళ్లలో మూడు నెలల ముందే బుక్ అయిపోవడంతో చాలా మంది ప్రైవేట్ ట్రావెల్స్ వైపు చూస్తున్నారు. దీంతో ఇదే అదునుగా ప్రైవేట్ ట్రావెల్స్ అధికంగా ధరలు పెంచాయి.
భారీగా పెంచిన బస్సు చార్జీలు : విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల చార్జీలు భారీగా పెంచారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి గరిష్టంగా రూ. 4వేలు, విశాఖపట్నంకు రూ.6వేలు వసూలు చేస్తున్నారు. ఆదిలాబాద్‌కు గరిష్టంగా రూ.5,000వేల నుంచి 6,000వేలకు టికెట్ ఛార్జీలు ఉన్నాయి.
ఏపీఎస్ఆర్టీసీలో సాధారణ ఛార్జీలే :టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఛార్జీలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. సాధారణ చార్జీలే అంటూ ఏపీఎస్ ఆర్టీసీ స్పష్టం చేయగా.. టీజీఎస్ఆర్టీసీ మాత్రం 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీలో సాధారణ చార్జీలే ఉండటంతో ఏపీ వెళ్లేవారంతా ఆ బస్సుల వైపే మొగ్గుచూపుతున్నారు. సంక్రాంతికి ప్రయాణికుల కోసం టీజీఎస్ఆర్టీసీ 6,432 బస్సులను నడుపుతుండగా.. ఏపీఎస్ఆర్టీసీ 7,200 బస్సులను నడుపుతుంది. సింహభాగం హైదరాబాద్ నుంచే ఉన్నాయి. ఈ నెల 11,12 తేదీల్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులను సిద్ధంగా ఉంచారు. సాధారణ ఛార్జీలున్న బస్సులు తక్కువగా నడపడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.