Pratidhwani Debate on Irrigation Projects in AP:ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ నదుల అనుసంధానాన్ని అటకెక్కించింది. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులనూ నట్టేట ముంచింది. వేలాది టీఎంసీల జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. కరవు రాష్ట్రంలో తాండవిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టనట్లు నదుల అనుసంధాన ప్రక్రియను మూలన పడేసింది. సాగునీటి సమస్యకు, కరువు కష్టాలకు పరిష్కారం ఏంటి? గత ప్రభుత్వం ఏం చేసింది? ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇదే అంశంపై ప్రతిధ్వని కార్యక్రమం.
రాష్ట్రంలో ఏటా వేలాది టీఎంసీల నదీజలాలు వృధాగా సముద్రంలోకి పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధపెట్టి వాటిలో కొంత వాడుకున్నా కరవును సమర్థంగా ఎదుర్కోవచ్చు. కర్షకుల కన్నీళ్లు తుడవచ్చు. వలసలు ఆపవచ్చు. సీఎం జగన్‌కు కానీ, జలవనరుల మంత్రి అంబటి రాంబాబుకు కానీ ఆ రంగంపై కనీస అవగాహన లేకపోవడం రాష్ట్రం చేసుకున్న దురదృష్టం. గత ప్రభుత్వం కేవలం ఐదేళ్లలోనే 70 శాతం పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసింది. జగన్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో మిగిలిన 30శాతం పూర్తిచేసి ఉంటే ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణగా మారేది. సాగునీటి సమస్యకు, కరువు కష్టాలకు పరిష్కారం ఏంటి? గత ప్రభుత్వం ఏం చేసింది? ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది?
జలవనరుల శాఖ అధికారులు ఆలోచన లేకుండా చేసిన పనికి, మండుతున్న ఎండలకు సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయి. మరో వైపు గేట్లు మరమ్మతుల పేరుతో నీటిని ఆపేశారు. కాలువలు పూర్తిగా ఎండిపోయాయి. పంట వేసిన భూమి బీటలు వారుతుంది. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు. ఓవైపు నదుల్లో ఉరకలెత్తుతున్న వరద ఉప్పు సముద్రం పాలవుతోంది. మరోవైపు నీళ్లు లేక, కరవు కోరల్లో చిక్కి జనం అల్లాడుతున్నారు. సాగునీరు రాక పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. ఇవేమి పట్టని జగన్ సర్కారు ఒంటెద్దు పోకడకలతో నదుల అనుసంధానాన్ని అటకెక్కించింది. భావితరాలకు కల్పతరువులైన జలవనరుల అనుసంధానానికి గత ప్రభుత్వం చేపట్టిన ‘మహాసంకల్పాన్ని కడలిపాలు చేసింది.
రాష్ట్రంలో 40 భారీ, మధ్య తరహా, చిన్నతరహా నదులు ఉన్నాయి. ట్రైబ్యునల్ అవార్డుల ప్రకారం కృష్ణా, గోదావరి నదుల నుంచి ఏటా నీటి కేటాయింపులు జరుగుతున్నాయి. పొరుగు రాష్ట్రాలతో ఉన్న ఒప్పందాల మేరకు బాహుదా, వంశధార, నాగావళి, పాలార్, పొన్నియార్ వంటి నదుల జలాలను వినియోగం సాగుతోంది. అయినా రాష్ట్రంలోని సాగు, తాగు అవసరాలకు నీరు చాలడం లేదు. తరచూ కరవు కాటకాల వల్ల కటకట తప్పడం లేదు. అధికారంలోకి వస్తే ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి, కొత్తగా లక్షల ఎకరాల ఆయకట్టు సృష్టిస్తానంటూ ఊరూవాడా ఊరించే మాటలు చెప్పారు జగన్. కానీ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడిచినా ఉసూరుమనిపించారు.