Prathipati Pullarao Fires on YSRCP :ఓటమి భయం నిలువెల్లా కమ్మేసిన ముఖ్యమంత్రి జగన్ రోజురోజుకీ మరింత దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. రాజకీయ క్షేత్రంలో నేరుగా ఎదుర్కోలేక తనకు అలవాటైన తప్పుడు కేసులతో ప్రత్యర్థులపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏ కంపెనీలో డైరెక్టర్‌గా గానీ, కనీసం షేర్ హోల్డర్ కూడా లేని తన కుమారుడిపై కక్షతో జీఎస్టీ ఎగవేతల ఉల్లంఘనల కేసులు పెట్టడమే అందుకు తార్కాణమని ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్సార్సీపీ గుండాలు రెచ్చిపోతే ఎముకలు విరగ్గొడతాం: పవన్ కల్యాణ్
Prathipati Pullarao Comment AP Govt :కంపెనీలో లేని, కంపెనీలతో సంబంధం లేని వ్యక్తికి జీఎస్టీ ఎగవేతలకు సంబంధం ఏమిటని ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. గతంలోనూ ఇలానే బురద జల్లాలని చూశారని, ఇప్పుడు మరోసారి అదే పన్నాగం పన్నినట్లు కనిపిస్తోందని ఆరోపించారు. తమకు సంబంధం లేని కంపెనీ పేరుతో దుష్ప్రచారానికి ఒడిగట్టారని మండిపడ్డారు. ఏపీఎస్‌డీఆర్‌ఐ ద్వారా తప్పుడు కేసులు బనాయించారని, వాటికి భయపడేది లేదని ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు.
Prathipati Sharat Arrested :తన కుమారుడిని స్టేట్‌మెంట్ కోసమని పిలిచి అదుపులోకి తీసుకున్నారని ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. వెంటనే అధికారపక్షం తమ అనుకూల మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, చట్టపరంగానే దీటుగా ఎదుర్కొంటామని ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు.
చిలకలూరిపేటలో తనపై పోటీకి వైఎస్సార్సీపీకి ధీటైన అభ్యర్థి దొరకట్లేదని, ఎన్నికలకు ముందే తన గెలుపు ఖాయమైందని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేటలో మంత్రి రజిని వైఫల్యాలే వైఎస్సార్సీపీ ఓటమికి బాటలు పరిచాయని తెలిపారు. అదే సమయంలో నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పార్టీని బలోపేతం చేసుకుని ఎన్నికలకి ముందే గెలుపు ఖాయమే బలమైన స్థాయికి చేరుకున్నామని, ఆ ప్రజాదరణ చూసి ఓర్వలేకే ఈ కేసుల రాజకీయానికి తెగబడ్డారని ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు.