Prathipati Pullarao Family Petitions: అవెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జీఎస్టీ ఎగవేత, బోగస్ ఇన్వాయిస్‌లతో నిధులు మళ్లించిందనే ఆరోపణలతో ఏపీ రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్(ఏపీఎస్‌డీఆర్‌ఐ) డిప్యూటీ డైరెక్టర్ ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విజయవాడ మాచవరం పోలీసులు ఫిబ్రవరి 25న నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.
మాచవరం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు కోసం మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు, ఆయన సతీమణి వెంకాయమ్మ, కుమార్తె ప్రత్తిపాటి స్వాతి, బొగ్గవరపు అంకమ్మరావు, కుర్రా జోగేశ్వరరావు, బొగ్గవరపు నాగమణి బీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రాటెక్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఎండీ బలుసు శ్రీనివాసరావు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. రాజకీయ కారణాలతో కేసు నమోదుచేశారని, అరెస్టు చేసే ప్రమాదం ఉన్నందున సాధ్యమైనంత త్వరగా విచారణ జరపాలని సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణరావు, న్యాయవాదులు వివి సతీష్, జవ్వాజి శరత్‌చంద్ర, కిలారు నితిన్ కృష్ణ కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. తదుపరి విచారణ నాటికి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించారు.
గద్దె దిగే సమయంలోనూ జగన్ విధ్వంసం, విద్వేషం కొనసాగిస్తున్నాడు : ప్రత్తిపాటి
కష్టడీ నిరాకరణపై హైకోర్టులో పోలీసులు అప్పీల్: మాచవరం పోలీసులు నమోదు చేసిన కేసులో నిందితుడు ప్రత్తిపాటి శరత్‌ను విచారణ నిమిత్తం పది రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ చేసిన అభ్యర్థనను విజయవాడ ఒకటో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారి తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే దీనిని సవాలు చేస్తూ అత్యవసరంగా పోలీసులు దాఖలు చేసిన అప్పీల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. నిందితుడు శరత్ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. బెయిలు పిటిషన్‌పై విజయవాడ కోర్టు విచారణ చేయకుండా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో పోలీసులు హైకోర్టును ఆశ్రయించారన్నారు.
కస్టడీ వ్యవహారంపై హైకోర్టులో పెండింగ్ ఉందన్న కారణం చెప్పి, బెయిలు పిటిషన్‌పై విచారణను వాయిదా వేయాలని కోరే దురుద్దేశం పోలీసులకు ఉందన్నారు. ఈ వాదనలపై న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు స్పందిస్తూ దిగువ కోర్టు విచారణపై తాను ఎలాంటి స్టే ఇవ్వలేదని, బెయిలు ఇవ్వాలా? వద్దా? అనేది సంబంధిత కోర్టు న్యాయవాధికారి విచక్షణాధికారం అని పేర్కొన్నారు. పోలీసులు వేసిన అప్పీల్‌పై విచారణను సోమవారానికి వాయిదా వేశారు.