Prajavedika Program at NTR Bhavan:మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి 'ప్రజావేదిక' కార్యక్రమం నిర్వహించారు. బాధితుల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. పలు సమస్యలపై సంబంధిత అధికారులు, పోలీసులతో మాట్లాడి పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు.
- గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జోగి రమేశ్ అండదండలతో కొందరు పోలీసులు అక్రమాలకు పాల్పడి తమపై దాడి చేసిన వారిని వదిలి బాధితులమైన తమ మీదే తప్పుడు కేసులు బనాయించారని ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరుకు చెందిన రాహేలు, రామకృష్ణలు ఫిర్యాదు చేశారు. తమపై దాడి చేసిన వైఎస్సార్సీపీ నేతలను వదిలి బాధితులమైన తమ మీదే తప్పుడు కేసులు బనాయించారని వాపోయారు. సీఐ కేసును ఉపసంహరించుకోవాలని చెప్పినా ఎస్సై, స్టేషన్ రైటర్‌లు డబ్బులు డిమాండ్ చేస్తూ తమను ఇబ్బంది పెడుతున్నారని బాధితులు వాపోయారు.
- 22 ఏళ్లుగా వ్యవసాయ మార్కెట్ యార్డులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న తనను పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కక్షగట్టి ఉద్యోగం నుంచి తొలగించారని సాదనాల సుబ్బారావు ఫిర్యాదు చేశారు.
- వైఎస్సార్సీపీ నేతలైన పాతూరి విజయ్‌కుమార్, వంశీలు తన పొలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలు మండలానికి చెందిన వల్లభనేని మాధవ్ వాపోయారు.
- నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న తమకు 18 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు.
- తన కుమారుడు కనిపించడం లేదని, పోలీసుల దగ్గరకు వెళ్తే రోజంతా స్టేషన్‌లో కూర్చోబెడుతున్నారు తప్ప ఆచూకీ కనుక్కోవడం లేదని పల్నాడు జిల్లా పమిడిపాడుకు చెందిన రమణమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు.
- వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఉన్నామనే అక్కసుతో తమ భూముల్ని నిషేధిత జాబితా నుంచి తొలగించలేదని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని నెల్లూరు జిల్లా కావలికి చెందిన శ్రీనివాసులు అర్జీ ఇచ్చారు. తమకు మినిమం టైం స్కేల్ ప్రకారం వేతనాలు చెల్లించాలని ఏపీ మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న అటెండర్లు, వాచ్‌మెన్లు విజ్ఞప్తి చేశారు.
సమస్యలు తీరుస్తామని హామీ: ఫిర్యాదులు అన్నీ స్వీకరించిన మంత్రులు తమ సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.