Fans Celebrate 'Kalki 2898 AD' Release :హైదరాబాద్‌లో కల్కి సినిమా విడుదల హడావుడి నెలకొంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా 70 ఎంఎం థియేటర్ వద్దకు ప్రముఖ సినీ హీరో ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రభాస్ కటౌట్ ముందు అభిమానులు డ్యాన్సులు చేసి కోలాహలం చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ సినిమా థియేటర్లలో తెల్లవారుజామున ఉదయం 4.30 కు కల్కి సినిమా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇప్పటికే పూర్తిగా మొదటి మూడు రోజుల టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయి. కల్కి సినిమా టికెట్ల బ్లాక్ వ్యాపారం జోరుగా కొనసాగిందని ప్రభాస్ అభిమానులు అంటున్నారు. అయినా సరే బ్లాక్‌లో భారీ ధరకు టికెట్లు కొని మరీ ఈ సినిమాను చూసేందుకు వెళ్లామని చెబుతున్నారు.
సంధ్య థియేటర్ వద్ద ఫ్యాన్స్ హంగామా : ఏ హీరో సినిమా అయినా ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్లో అభిమానుల సందడి మాములుగా ఉండదు. అందులోనూ పాన్ ఇండియా స్టార్, అదేనండి మన రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటే మామూలుగా ఉంటుందా మరి. సినిమా విడుదలకు రెండు మూడు గంటల నుంచే, కొందరైతే ఏకంగా రాత్రి నుంచే థియేటర్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే సంధ్య థియేటర్ అభిమానులతో కిక్కిరిసిపోయింది. తమ అభిమాన హీరో సినిమా సంధ్య థియేటర్లో చూడటం ఆనవాయితీగా పెట్టుకున్న అభిమానులు, వేల సంఖ్యలో థియేటర్‌కు వచ్చారు. థియేటర్ మొత్తం రెబల్ స్టార్ ప్రభాస్ కటౌట్లతో నింపారు నిర్వాహకులు. ప్రభాస్ చిత్రానికి భారీ గజమాలను వేశారు. పాలాభిషేకంతో తమ అభిమానాన్ని చాటుకున్నారు ఫ్యాన్స్. థియేటర్ వద్ద టికెట్ కొందామనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది.