Deputy CM Bhatti Responded to Electricity Employees Promotions :మనం అందరం కలిసి రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల జీవితాల్లో మార్పు అంటే వారి జీవన స్థితిగతులు మారడం, కొనుగోలు శక్తి పెరగడమే అని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో ఎస్పీడీసీఎల్లో పదోన్నతులు పొందిన అధికారులు, ఉద్యోగులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను సన్మానించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర సంపదలో తామంతా భాగస్వాములు అయినప్పుడే అద్భుతమైన మార్పులు వస్తాయని, పోరాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రానికి ఫలితం ఉంటుందని ఆయన అన్నారు. లేకపోతే కోరి తెచ్చుకున్న కొత్త రాష్ట్రంలో న్యాయం చేయలేని వారిగా నిలబడిపోతామన్నారు. గత ఏడున్నర సంవత్సరాలుగా పదోన్నతులు లేకుండా ఎదురుచూస్తున్న విద్యుత్ ఉద్యోగులందరినీ ప్రజా ప్రభుత్వం గుర్తించి పదోన్నతని ఇవ్వాలని తాను, సీఎం, మంత్రిమండలి సభ్యులు నిర్ణయించామని తెలిపారు.
బాగా పని చేసే వాతావరణం కల్పించడం కోసమే పదోన్నతులు : మీరంతా కూడా ఈ రాష్ట్రం నాది, ఈ ప్రభుత్వం నాది, ఈ రాష్ట్ర ప్రజలు నా వాళ్లు అని భావించాలని ఉద్యోగులు, అధికారులకు సూచించారు. ప్రభుత్వ పరంగా ఆర్థిక ఇబ్బందులున్నా, ఉద్యోగులు అధికారులు బాగా పని చేసే వాతావరణం కల్పించడం కోసం పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు.