Power Consumption Increased In Hyderabad :రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా గ్రేటర్లో గురువారం రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదైంది. వేసవి తాపం కారణంగా అమాంతం విద్యుత్ వినియోగం(Energy Consumption) పెరిగింది. దీంతో గతేడాది మే నెలలో వినియోగం రికార్డులను ఈ సంవత్సరం మార్చిలోనే బద్దలు కొట్టింది. 2023లో మే 19న అత్యధికంగా 79.33 మిలియన్ యూనిట్ల వినియోగం ఇప్పటివరకు రికార్డుగా ఉంది. అయితే మార్చి 28న 79.48 మిలియన్ యూనిట్ల వినియోగంతో పాత రికార్డులు చెరిగిపోయాయి. గతేడాది ఇదే సమయానికి విద్యుత్ వినియోగం 67.97 మిలియన్ యూనిట్లే ఉంది. ఈ నెల ఆరంభం నుంచి గ్రేటర్లో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది.
23 శాతం వరకు పెరుగుదల :గత ఏడాది మార్చి నెలలో సరాసరి విద్యుత్ వినియోగం 57.84 మిలియన్ యూనిట్లు నమోదవ్వగా అది ఈ ఏడాది 70.96 మిలియన్ యూనిట్లకు పెరిగింది. అంటే సుమారు 22.7 శాతం పెరుగుదల నమోదైంది. ఈ ఏడాది వేసవిలో విద్యుత్తు వినియోగం అధికారుల అంచనాలకు మించి నమోదవుతుంది. మే నెలలోవిద్యుత్ వినియోగం గరిష్ఠంగా 83-85 మిలియన్ యూనిట్ల వరకు ఉండొచ్చని అధికారులు మొదట్లో అంచనాలు వేశారు. ఇప్పుడు వాడుతున్న తీరును పరిశీలిస్తే 90 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం ఉందని వెల్లడించారు. విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా తట్టుకునేవిధంగా అదనపు లైన్లు, ట్రాన్స్ఫార్మార్లు, ఇతరత్రా ఏర్పాట్లు చేసినట్లుగా అధికారులు వెల్లడించారు.
Electricity Usage in Hyderabad Increased :విద్యుత్ సరఫరా తీరుపై ప్రతీరోజూ ఉదయం 8.30 గంటలకు సీజీఎంలు, ఎస్ఈలతో సీఎండీ ముషారఫ్ ఫరూఖీ టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. విద్యుత్ డిమాండ్- సరఫరాలో అంతరాయాలపై, సిబ్బంది హాజరు లాంటి రిపోర్టులను పరిశీలిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలను ఆకస్మికంగా సందర్శిస్తున్నారు.