Suspense on SI, Constable, Computer Operator Death : సంచలనంగా మారిన కామారెడ్డి జిల్లా భిక్కనూర్ ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శ్రుతి, బీబీపేట యువకుడు నిఖిల్ మృతి కేసు వెనక ఉన్న కారణాలపై మిస్టరీ వీడలేదు. ముగ్గురూ చెరువులో మునగడం వల్లే మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికల్లో వెల్లడైంది. ముగ్గురి శరీరాలపై ఎలాంటి గాయాలు లేవని, నీటిలో ఊపిరాడకే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ముగ్గురూ కలిసే చనిపోయారా? ఒకరు ఆత్మహత్యకు యత్నిస్తే కాపాడే క్రమంలో మిగతా ఇద్దరూ మరణించారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
ముగ్గురి సెల్‌ఫోన్లు 25న స్విచ్ ఆఫ్ అయినట్లు గుర్తించిన పోలీసులు, భిక్కనూర్ ఠాణా నుంచి వారు మరణించిన అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వరకూ దారి పొడవునా ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ముగ్గురి కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్‌లు పరిశీలించగా, శ్రుతి, నిఖిల్ మధ్య ఆత్మహత్యకు సంబంధించి సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. వారిద్దరూ నేను చనిపోతానంటే, నేను చనిపోతానని వాట్సాప్‌లో చాటింగ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న విషయాన్ని ఎస్సై సాయికుమార్‌తో చర్చించినట్లు తెలుస్తోంది.
అయితే సాయికుమార్‌కు చెందిన మూడు సెల్‌ఫోన్లలో రెండు అన్‌లాక్ అయి ఉన్నాయని, వాటిని పరిశీలించిన తర్వాతే మిగతా విషయాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. ముగ్గురికీ ఆర్థిక పరమైన అంశాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో ముగ్గురి బ్యాంక్ ఖాతా వివరాలు పోలీసులు సేకరించారు.