Pooja on Occasion Of Ayodhya in Singapore : బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సింగపూర్‌లోని భక్తులు అయోధ్య శ్రీరామ పవిత్ర అక్షింతల వితరణ మహోత్సవం ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో భారతదేశం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన అయోధ్య శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ అక్షింతలను అక్కడి భక్తులకు పంపిణీ చేశారు. ఈ అక్షితల వితరణ మహోత్సవాన్ని సింగపూర్‌లోని చాంగి గ్రామంలో శ్రీరాముని ఆలయంలో కన్నుల పండుగలా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక భక్తులందరూ భక్తిశ్రద్ధలతో రామనామ స్మరణ చేస్తూ పూజలు చేశారు. అనంతరం అయోధ్య శ్రీరాముని అక్షింతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణమంతా జైశ్రీరామ్ నామస్మరణతో మార్మోగింది. ఈ వేడుకల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు శ్రీ రాముని సేవలో భక్తిశ్రద్ధలతో పరవశించి పోయారు. ఈ సందర్భంగా పూజ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ పవిత్ర కార్యక్రమాన్ని సింగపూర్‌లో నిర్వహించిన తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ సభ్యలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అభినందించారు.