Vijayawada Police Traced Girl Missing Case : ఓ తల్లి తొమ్మిది నెలల కన్నీటి శోకానికి విముక్తి కలిగింది. అదృశ్యమైన కుమార్తె ఆచూకీ లభ్యమవటంతో తల్లి ఆనందం వ్యక్తం చేస్తోంది. గత నెల 22న మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రజాదర్బార్ నిర్వహించారు. పలువురి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. తమ కుమార్తె ఆచూకీ తెలియక 9 నెలలు అవుతోందని మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.
Pawan on Girl Missing Case in Vijayawada :తన చిన్న కుమార్తె విజయవాడలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతోందని, అదే కళాశాలలో చదువుతున్న సీనియర్ ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడని తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయిందని వాపోయింది. వెంటనే స్పందించిన పవన్ కల్యాణ్ మాచవరం సీఐ గుణరాముకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. దర్యాప్తు వేగం పెంచి బాలిక ఆచూకీ కనిపెట్టాలని ఆదేశించారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశంతో కదిలిన విజయవాడ పోలీసులు తిరిగి దర్యాప్తు ప్రారంభించినా పురోగతి లభించలేదు. వారు వాడుతున్న ఫోన్ నంబర్లు తెలియకపోవడమే ఇందుకు కారణం. విజయవాడ నుంచి ఆ యువకుడు యువతిని హైదరాబాద్ తీసుకెళ్లాడు. అక్కడ పలు ప్రాంతాల్లో తిరిగి డబ్బుల్లేక నగలు, ఫోన్లు అమ్మేశారు. ఆ తర్వాత కేరళ, ముంబై, దిల్లీలో తిరుగుతూ చివరకు జమ్మూకు చేరారు. అక్కడ హోటల్లో అతను పనికి కుదిరాడు.