Niloufer Baby kidnapping Case: నిలోఫర్‌లో కిడ్నాపైన శిశువును నాంపల్లి పోలీసులు తల్లి ఒడికి చేర్చారు. బిడ్డను ఎత్తుకెళ్లిన మహిళను సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించి ఏపీలోని కర్నూల్లో అరెస్ట్ చేశారు. జహీరాబాద్‌కు చెందిన గఫూర్, హసీనా బేగంల కుమారుడు (నెల రోజులు)కి కామెర్లు సోకాయి. దీంతో ఆ శిశువును ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ ఒక గుర్తుతెలియని మహిళ బాలున్ని ఎత్తుకుంటా అని నమ్మించి ఎత్తుకెళ్లింది. బాధితుల ఫిర్యాదుతో నాంపల్లి పోలీసులు కేసును ఛేదించారు. ఆదివారం ఏసీపీ సంజయ్‌కుమార్, ఇన్‌స్పెక్టర్ అప్పలనాయుడు కేసు వివరాలు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం : ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన అబ్దుల్లా అలియాస్ వెంకటేశ్ (35), రేష్మా (30), షహీనా బేగం (28)లు మాసబ్‌ట్యాంక్ ఇందిరానగర్ పోచంబస్తీలో ఉంటున్నారు. అబ్దుల్లా, రేష్మాలు దంపతులు. వీరికి వారసుడు కావాలనే ఉద్దేశంతో ఆసుపత్రి నుంచి శిశువును రేష్మా సోదరి షహీనా బేగం ఎత్తుకెళ్లారు. పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా కర్నూలులోని పుల్లూరు టోల్‌ప్లాజ్ వద్ద నిందితులను పట్టుకున్నారు.
భర్త వేధింపులు భరించలేక:రేష్మా, షహీనాబేగం అక్కాచెల్లెళ్లు. రేష్మా దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. వారసుడిని ఇవ్వలేకపోయావంటూ భర్త నుంచి వేధింపులు పెరిగాయి. ప్రస్తుతం ఆమె గర్భిణి. నాలుగోసారి అమ్మాయి పుడితే ఎలాగని మనోవేదనకు గురైంది. సోదరి, భర్త సహాయంతో ముగ్గురూ నిలోఫర్‌కు చేరారు. అదే సమయంలో డిశ్చార్జ్ అయిన మగశిశువును గమనించారు. అమ్మమ్మ చేతిలో ఉన్న ఆ శిశువును తెలివిగా ఎత్తుకెళ్లి ఎట్టకేలకు పోలీసులకు చిక్కడంతో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం అపహరణకు గురైన పసికందును బిడ్డ తల్లికి అప్పగించారు.