Police Searching for Vallabhaneni Vamsi:కృష్ణాజిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసేందుకు పోలీసుల వేట కొనసాగుతోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని ఇప్పటికే ముద్దాయిగా చేర్చిన గన్నవరం పోలీసులు, ఆయన ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో 19 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా రమేష్, యూసఫ్ అనే ఇద్దర్ని అరెస్టు చేశారు. వీరిలో రమేష్ ను కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. యూసఫ్‌ను శనివారం కోర్టులో హాజరుపర్చనున్నారు.
వంశీ కోసం హైదరాబాద్‌లో మూడు బృందాలతో పోలీసులు గాలించారు. ఈ కేసులో ఏ71గా ఉన్న వంశీని అదుపులోకి తీసుకుని విచారణ జరిపితే దాడికి చెందిన మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. వంశీ సహా, కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పలువురిని అదుపులోకి తీసుకునేందుకు హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక పోలీసు బృందాలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. కొన్ని రోజులుగా అక్కడే మకాం వేసిన అధికారులు వంశీ సహా పలువురి కదలికలపై నిఘా ఉంచారు.
శుక్రవారం మధ్యాహ్నం వంశీని అరెస్టు చేసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరిగింది. కానీ అవన్నీ వదంతులేనని పోలీసులు కొట్టిపారేశారు. మరోవైపు వంశీని ఎలాగైనా అరెస్టు చేయాలనే ఉద్దేశంతో వివిధ కోణాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్‌లో ఉన్నారా, లేక ఇతర ప్రాంతాలకు వెళ్లారా అనే దానిపై లోతుగా పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కాల్ డేటా , సహాయకుల కదలికలను నిశితంగా పరిశీలించినట్లు సమాచారం. మరోవైపు వంశీ సతీమణి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లారని సమాచారం.
వంశీ ప్రోద్బలంతోనే దాడి: దాడిలో వంశీ నేరుగా పాల్గొనకపోయినా ఎమ్మెల్యే హోదాలో ఆయన ప్రోద్బలంతోనే వైఎస్సార్సీపీ మూకలు విధ్వంసం సృష్టించాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో వంశీ కోసం పోలీసులు హైదరాబాద్, గన్నవరం తదితర ప్రాంతాల్లో గాలిస్తున్నారు. మొన్నటి వరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో అక్కడి పోలీసులు వంశీ సొంత మనుషులుగా చెలామణి అయ్యారు. వంశీ అనుయాయులుగా ఉన్న పోలీసులు కీలక స్థానాల్లో ఉండడంతో ఈ కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.