Police Search for Marijuana Suspects :ఉత్తరాంధ్ర జిల్లాల్లో గంజాయి కేసుల్లో పట్టుబడి జైలుకు వెళుతున్నారు. కొన్ని రోజులకు బెయిల్‌పై జైలు నుంచి బయటకు వస్తున్నారు. తరువాత కోర్టు విచారణకు హాజరు కావడం లేదు. వారిలో చాలా మంది ఆచూకీ కూడా ఉండటం లేదు. గంజాయి తరలిస్తూ పట్టుబడిన వారిని విచారించే సమయంలో మరికొందరి బయట వ్యక్తుల ప్రమేయమూ వెలుగు చూస్తోంది. పోలీసులు వారిపైనా కూడా కేసులు నమోదు చేస్తున్నారు. అరెస్ట్ చేయడానికి వెళ్తే జాడ లేకుండా పోతున్నారు. విశాఖ రేంజ్ పరిధిలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో 9 వందల మందికిపైగా తప్పించుకు తిరుగుతున్నారు. వీరి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి గత 5 నెలల్లో 237 మందిని పట్టుకున్నారు. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు.
29 ప్రత్యేక బృందాలు గాలింపు :ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట గంజాయి పట్టుపడుతూనే ఉంది. నిందితుల్లో కొందరు పోలీసులకు చిక్కుతున్నారు. మరికొందరు వారి నుంచి తప్పించుకుపోతున్నారు. పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి రిమాండుకు పంపుతున్నారు. వీరిలో కొందరు బెయిల్‌పై వచ్చాక పోలీసులకు కనిపించకుండా తిరుగుతున్నారు. కోర్టు వాయిదాలకు హాజరు పరచాలని సమన్లు జారీ అవుతున్నా నిందితుల పత్తా దొరక్క, కేసుల పురోగతి ముందుకు వెళ్లడం లేదు.
'పుష్పా' ఎర్రచందనమే కాదు - మన శీలావతికీ దేశవ్యాప్త డిమాండ్
అనకాపల్లి జిల్లా చోడవరం కోర్టు పరిధిలోనే 2019 తరువాత బెయిల్‌పై వచ్చి తదుపరి విచారణకు హాజరుకాని వారు 27 మంది వరకు ఉన్నారు. వీరిలో 16 మందిపై నాన్ బెయిల్‌బుల్ వారెంట్లు జారీ అయ్యాయి. వీరి కోసం గాలిస్తున్నట్లు చోడవరం ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ పాపునాయుడు తెలిపారు. ఇక్కడే కాదు 3 ఉమ్మడి జిల్లాల పరిధిలోనూ పరారీ నిందితులు భారీగానే ఉన్నారు. వీరి కోసం 29 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో వారిని పట్టుకుని తీసుకురావడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది.