Kadambari Jethwani Case Updates :ముంబయి సినీనటి కాదంబరీ జెత్వానీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు కుక్కల విద్యాసాగర్‌ను దెహ్రాదూన్ నుంచి రైలులో అర్ధరాత్రి తీసుకొచ్చిన పోలీసులు ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, వైద్య పరీక్షల అనంతరం ఇవాళ తెల్లవారుజామున న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ క్రమంలోనే పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించారు. ఆ రిపోర్ట్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారులు పి.సీతారామాంజనేయులు (పీఎస్‌ఆర్), కాంతిరాణా తాతా, విశాల్‌గున్నీని నిందితులుగా చేర్చారు.
విద్యాసాగర్‌తో అధికారులు కుమ్మక్కయ్యారు :ఈ కేసులో ఏ1గా విద్యాసాగర్, ఏ2గా పి.సీతారామాంజనేయులు (పీఎస్‌ఆర్), ఏ3గా కాంతిరాణా, ఏ4గా వెస్ట్‌జోన్ పూర్వ ఏసీపీ హనుమంతురావు, ఏ5గా ఇబ్రహీంపట్నం పూర్వ సీఐ సత్యనారాయణ, ఏ6గా విశాల్‌గున్నీ పేర్లను పోలీసులు చేర్చారు. విద్యాసాగర్‌తో అధికారులు కుమ్మక్కైనట్లు రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ ఐదుగురిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
Mumbai Actress Case Updates : పి.సీతారామాంజనేయులు, కాంతి రాణా, విశాల్‌గున్నీ వైస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్‌తో కుమ్మక్కై కాదంబరీ జెత్వానీని అక్రమంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. మరోవైపు కుక్కల విద్యాసాగర్‌కు వచ్చే నెల 4 వరకు జడ్జి రిమాండ్ విధించగా విజయవాడ సబ్ జైలుకు తరలించారు. అతడిని పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులోని మిగతా నిందితులకూ అరెస్ట్ భయం వెంటాడుతోంది.