CCS ACP Umamaheswara Rao Case Updates : హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీగా పనిచేస్తూ మంగళవారం చిక్కిన ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించిన ఆస్తుల లెక్క తేల్చడంపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. 2014 నుంచి మంగళవారం తమకు చిక్కే వరకు ఆయన ఆదాయ వ్యయాలను అధికారులు లెక్కగట్టారు. ఈ పది సంవత్సరాల్లో ఉమామహేశ్వరావుకు సుమారు రూ.కోటి ఆదాయం సమకూరినట్లు వెల్లడైంది. ఇదే సమయంలో అతడితోపాటు బంధువులు, బినామీల పేరిట ఉన్న స్థిర, చరాస్తుల విలువ రూ.3.95 కోట్లు ఉన్నట్లు తేలింది. బహిరంగ మార్కెట్‌లో ఆ మొత్తం విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. ఉమామహేశ్వరరావును బుధవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతడికి 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.
అత్తామామల పేరిటే ఎక్కువ రిజిస్ట్రేషన్ : 2014 నుంచి ఉమామహేశ్వరరావు కొనుగోలు చేసిన ఆస్తులను ఎక్కువగా అత్తామామలు, ఇతర బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. శామీర్‌పేటలో 2022లో విల్లా కోసం రూ.50 లక్షలు, 2017లో జవహర్‌నగర్ అయ్యప్పనగర్‌కాలనీ సమీపంలో ఓపెన్ ప్లాట్ కోసం రూ.10 లక్షలు చెల్లించారు. ఘట్‌కేసర్ మండలంలో ఓపెన్ ప్లాట్ కోసం రూ.19.90 లక్షలు, మరో ప్లాట్ కోసం రూ.37.54 లక్షలు చెల్లించారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో రూ.7.5 లక్షల విలువైన 25 సెంట్ల స్థలాన్ని చోడవరం న్యూ శాంతినగర్ కోఆపరేటివ్ కాలనీలో రూ.4.8లక్షల విలువైన 240 చ.గ. ప్లాట్‌ను, చోడవరం మండలంలో రూ.32.56 లక్షల విలువైన స్థలాన్ని కొనుగోలు చేశారు.
ACP Umamaheswara Rao Corrupt Case :మరోవైపు ఉమామహేశ్వరరావు ఇబ్రహీంపట్నంలో ఏసీపీగా ఉన్నప్పడు వివాదాస్పద భూముల విషయంలో జోక్యం చేసుకుని ఇరువర్గాల నుంచి డబ్బులు డిమాండ్ చేసే వారని తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కున్నారు. కాగా తమను నిర్దాక్షిణ్యంగా హింసించేవాడని కొందరు బాధితులు ఏసీబీ ప్రధాన కార్యాలయంలో బుధవారం నాడు ఫిర్యాదు చేశారు. అలాగే ఆయన సాహితీ ఇన్‌ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉన్నారు. అయితే విచారణ అధికారులు నిత్యం మారుతూ ఉండడం వల్ల సాహితి ఇన్‌ఫ్రా బాధితులకు న్యాయం దూరం అవుతోందని సాహితీ ఇన్‌ఫ్రా బాధితుల తరుఫు న్యాయవాది కృష్ణకాంత్ అన్నారు. ఉమామహేశ్వరావు వచ్చిన తర్వాత కేసు కాస్త వేగవంతం అయిందని అనుకునేలోపే ఆయన అరెస్ట్ అవడంతో బాధితుల ఆశలు నీరుగారిపోతున్నాయని చెప్పారు.