Police Case on Perni Nani : రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. ఆయణ్ని ఏ6గా బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న నలుగురు నుంచి సేకరించిన సమాచారం మేరకు పేర్ని నాని పేరును A-6గా చేరుస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. పేర్ని నాని ఆదేశాల మేరకే మిల్లర్ నుంచి లారీ డ్రైవర్‌కు, లారీడ్రైవర్ నుంచి నిందితులకు నగదు లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్ పే, ఆన్‌లైన్ బ్యాంకు లావాదేవీలను సేకరించారు.
బియ్యం మాయం కేసులో పోలీసులు కేసు నమోదు చేయడం ఇదే సమయంలో అరెస్టు చేస్తారన్న ఊహాగానాలతో పేర్ని నాని కోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని స్వీకరించిన హైకోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అప్పటివరకు పిటిషనర్‌పై తొందరపాటు చర్యలు వద్దని పోలీసులకు ఆదేశించింది.
Perni Nani Ration Rice Case :మరోవైపు రేషన్ బియ్యం మాయం కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి మచిలీపట్నంలోని స్పెషల్ మొబైల్ జడ్జి 12 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితులను మచిలీపట్నం సబ్‌జైలుకు తరలించారు. ఈ కేసులో పేర్ని నాని సతీమణి జయసుధను ఏ1గా పోలీసులు పేర్కొన్నారు. ఆమెకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే అరెస్టైన నలుగురు నిందితుల్లో గోదాము మేనేజర్ మానస్ తేజ, పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్లు యజమాని బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ బోట్ల మంగరాజు ఉన్నారు.