Police Recovery Amount On Cyber Crime Cases :ఒకప్పుడు సైబర్ నేరం జరిగితే నిందితుడిని పట్టుకున్నా డబ్బు తిరిగి రాదనే అభిప్రాయం ఉండేది. కానీ ప్రస్తుతం తెలంగాణ పోలీసులు పోయిన డబ్బును రికవరీ చేసి తిరిగి బాధితులకు అప్పగిస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక సైబర్ నేరాలు నమోదయ్యే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది జనవరిలో 63 కేసుల్లో రూ.2.53 కోట్లను బాధితులకు బ్యాంకు ఖాతాల్లో తిరిగి జమ చేశారు. గతంలోనూ ఇదే తరహాలో సైబరాబాద్ పోలీసులు 44 కేసులకు సంబందించిన రూ.2.23 కోట్లను బాధితుల ఖాతాల్లో జమ చేశారు.
ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు (Cyber Crime Police Telangana)ఒక్క కేసులోనే రూ.34 లక్షలు బాధితుడికి అందజేశారు. మరికొన్ని కేసుల్లోనూ ఇదే తరహాలో నేరస్థుల ఖాతా నుంచి డబ్బును తిరిగి రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిల్లోనూ ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇన్నాళ్లు మందకొడిగా సాగుతున్న రికవరీ కొత్త విధానంతో మరింత మెరుగవుతోందని అధికారులు వివరిస్తున్నారు.
Cyber Crimes in Telangana : సైబర్ నేరం జరిగిన తర్వాత నిందితులు కొల్లగొట్టిన డబ్బు స్వాధీనం చేసుకోవడం సుదీర్ఘ ప్రక్రియలా ఉండేది. ఒక బాధితుడు సైబర్ ముఠాలకు (Cyber Crimes) డబ్బు బదిలీ చేసిన తర్వాత ఆ సొమ్మును ఇతర ఖాతాలకు బదిలీ చేసే అవకాశం లేకుండా స్తంభింపచేసేవారు. ఆ తర్వాత నిందితులు చిక్కినప్పుడే డబ్బు ఎంతోకొంత రికవరీ చేసేందుకు అవకాశం ఉండేది. దీంతో బాధితులు పోగొట్టుకున్న డబ్బు రికవరీ అసాధ్యంగా ఉండేది.
ప్రజల నమ్మకమే సైబర్ మోసగాళ్లకు పెట్టుబడి - చైనా పరిజ్ఞానంతో జేబులు ఖాళీ
ఈ తరహా నేరాల్లో డబ్బు రికవరీ చేసేందుకు గుజరాత్ పోలీసులు అనుసరిస్తున్న విధానంపై సైబర్‌క్రైమ్ పోలీసులు అధ్యయనం చేశారు. సీఆర్పీసీ చట్టం ప్రకారం కోర్టు ఆదేశాలతో నేరస్థులు చిక్కకపోయినా డబ్బును తిరిగి బాధితులకు అప్పగించే అవకాశమేర్పడుతోంది. దీనిపై అధ్యయనం చేసి గతేడాది నుంచి ఇక్కడా అమలుచేస్తున్నారు. తెలంగాణలో సైబర్ నేరాల ఫిర్యాదుకు ప్రత్యేకంగా 1930 కాల్ సెంటర్ ఉండడం, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రధానంగా ఆన్‌లైన్ మోసాలపైనే పనిచేస్తుండడం రికవరీ ప్రక్రియ వేగంగా జరుగుతోంది.