Police Recovering Less Amount in Cybercrime :తెలుగు రాష్ట్రాల్లోసైబర్ నేరగాళ్లు కొండంత సంపద కొల్లగొడుతుంటే, పోలీసులు మాత్రం అతి కష్టం మీద గోరంత నగదును రికవరీ చేయగలుగుతున్నారు. 90 శాతం మంది బాధితులకు న్యాయం దక్కడం లేదు. ఒక్క తెలంగాణ నుంచే ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల్లో సైబర్ మోసగాళ్లు రూ.1300 కోట్లు కొల్లగొట్టారు. కానీ ఇందులో పోలీసులు ఇప్పటి వరకు రూ.114 కోట్లు మాత్రమే రికవరీ చేశారు. ఇది పోయిన సొమ్ములో 10 శాతం కూడా కాదు. ప్రజలు సైబర్ నేరాల పట్ల కొద్దిపాటి అవగాహన పెంచుకుంటే వాటిని నియంత్రించడంతో పాటు బాధితులు పోగొట్టుకున్న సొమ్ములో చాలావరకు తిరిగి రాబట్టవచ్చని సైబర్ పోలీసులు చెబుతున్నారు.
డిజిటల్ అరెస్ట్ చేసి :ఉదాహరణకు ఒక ప్రముఖ బహుళజాతి సంస్థలో అకౌంట్స్ విభాగంలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న వ్యక్తికి ముంబయి పోలీసుల పేరిట ఓ ఫోన్ కాల్ వచ్చింది. మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని, వీడియో కాల్ ద్వారా సీబీఐ విచారణకు హాజరుకావాలని చెప్పారు. అలా వీడియో కాల్లో విచారణలో ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతాల వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. బెదిరించి ఆయన్ను డిజిటల్ అరెస్ట్ చేయడంతో ఆయన భయంతో అన్ని వివరాలు ఇచ్చారు. అకౌంట్లోని సొమ్మంతా పోయాక మోసపోయానని తెలిసిన తర్వాత ఏమీ చేయాలో బాధితునికి అర్థం కాలేదు. ఆలస్యంగా 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేశారు. అప్పటికే ఆయన ఖాతా నుంచి మాయమైన సొమ్మంతా దేశ వ్యాప్తంగా వేర్వేరు ఖాతాల్లోకి జమకావడం వాటిని నేరగాళ్లు ఎక్కడికక్కడ డ్రా చేసుకోవడం అన్ని జరిగిపోయాయి.