Measures to Prevent Road Accidents in Telangana :నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక దగ్గర రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దేశంలోనే రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. అయితే ఈ రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి పోలీసులు వినూత్న చర్యలకు సిద్ధమవుతున్నారు. ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలు, సమయాన్ని సాంకేతికంగా అధ్యయనం చేసి, ప్రత్యేక గస్తీ నిర్వహించాలని చూస్తున్నారు. ఈ విధంగా ప్రమాదాలు తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే అధికారులు ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు మొదలుపెట్టేశారు.
రాష్ట్రంలో సగటున రోజుకు 56 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో 18 మంది మరణిస్తున్నారు. అయితే జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాదాల విషయంలో దేశంలోనే తెలంగాణ 8వ స్థానంలో ఉండటం కాస్త ఆందోళన కలిగిస్తోంది. గతేడాది రాష్ట్రంలో 20,699 ప్రమాదాలు జరగ్గా, 6,788 మంది మరణించారు. ఇది ప్రతి సంవత్సరానికి పెరుగుకుంటూ వస్తుండడం ఆందోళన చెందాల్సిన అంశమే. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్రమాదాలు, వాటి తాలూకూ మరణాలను తగ్గించలేకపోతున్నారు పోలీసులు.
రాష్ట్రంలో సుమారు 200 బ్లాక్ స్పాట్లు : రోడ్డు ప్రమాదాలు నియంత్రించేందుకే కేవలం పోలీస్ శాఖలో ప్రత్యేకంగా రహదారి భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ రహదారి భద్రత విభాగం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం రోడ్డు నిర్మాణ లోపం, మితిమీరిన వేగం. ఈ రెండింటినీ నివారిస్తే ప్రమాదాలు అవే తగ్గిపోతాయి. ముఖ్యంగా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి మరమ్మతులు చేయాలి. ఈ బ్లాక్ స్పాట్లు ఒక్క హైదరాబాద్-విజయవాడ రహదారిలోనే 17 ఉన్నట్లు గుర్తించారు. వీటిని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడుతున్నారు.