ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రబాబుపై రాళ్లదాడి కేసు - మొండితోక సోదరుల చుట్టూ ఉచ్చు

చంద్రబాబును అంతమొందించేందుకు పక్కా ప్రణాళిక - బాబుపై నందిగామలో రెండేళ్ల నాటి రాళ్ల దాడి కేసు

Chandrababu Stone Pelting Case
Chandrababu Stone Pelting Case (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2024, 6:52 AM IST

Updated : Nov 25, 2024, 7:15 AM IST

Chandrababu Stone Pelting Case : చంద్రబాబుపై రెండేళ్ల నాటి రాళ్లదాడి కేసులో వైఎస్సార్సీపీ అధినేత జగన్‌కి అత్యంత సన్నిహితులైన మొండితోక సోదరుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అప్పటి నందిగామ ఎమ్మెల్యే జగన్మోహనరావు, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ల ఆధ్వర్యంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును అంతమొందించే కుట్రకు ప్రణాళిక రచించి, తమ అనుచరులతో అమలుచేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వీరి పేర్లను నిందితుల జాబితాలో చేర్చనున్నట్లు సమాచారం. నిందితుల విచారణలో వీరి పాత్ర వెల్లడైంది. ఇప్పటికే 17 మందిని నిందితులుగా గుర్తించి, నలుగురిని అరెస్టు చేశారు. త్వరలో మరిన్ని కీలక అరెస్టులు ఉండొచ్చని తెలుస్తోంది.

2022 నవంబర్​ 4న అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా నందిగామలో పర్యటించారు. అ రోజు సాయంత్రం 6:30 గంటలకు ఆయన వాహనం గాంధీబొమ్మ సెంటర్‌ నుంచి మున్సిపల్‌ కార్యాలయం వైపు వెళ్తుండగా రైతుబజార్‌ వద్ద రాళ్లదాడి జరిగింది. ఇందులో సీఎస్‌ఓ మధుకు గాయమైంది. చంద్రబాబు పర్యటనకు రెండు రోజుల ముందు నాటి ఎమ్మెల్యే జగన్మోహనరావు, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ తమ అనుచరులతో భేటీ అయ్యారు.

Chandrababu Convoy Attack Case : చంద్రబాబు కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు కుట్రపన్నారు. ఇందుకు మూడు గ్యాంగ్​లను ఏర్పాటుచేశారు. ఓ బృందం విద్యుత్ సరఫరా నిలిపివేయడానికి, మరో రెండు రాళ్లతో దాడి చేసేందుకు ఏర్పాటయ్యాయి. ఒక బృందం గురితప్పినా మరొకటి పని పూర్తిచేసేలా ప్రణాళిక సిద్ధమైంది. అనుకున్నట్లే ఒక గ్యాంగ్ చంద్రబాబు పర్యటన మార్గం వెంబడి కరెంట్ సరఫరాను నిలిపివేసింది. ఇంతలో ఓ బృందం వెంట తెచ్చుకున్న రాళ్లతో దాడిచేసింది.

ఈ ఘటనపై దర్యాప్తులో అప్పటి పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ నేతలకు ఇబ్బంది కలగకూడదనే నాటి విజయవాడ పోలీసు కమిషనర్‌ దర్యాప్తును పక్కదారి పట్టించారు. దాడి సమయంలో చాలామంది చంద్రబాబుపై పూలు చల్లుతున్నారు ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి రాయి గానీ, అలాంటి వస్తువు విసిరి ఉంటాడని భావిస్తున్నామని అప్పటి సీపీ కాంతిరాణా బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేయడంపై అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. దాడిపై కేవలం సెక్షన్‌ 324 కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్‌ కింద ఏడు సంవత్సరాలలోపు శిక్షకే ఆస్కారం ఉంది.

విధుల్లో ఉన్న విద్యుత్ ఉద్యోగిని కాదని సెలవులో ఉన్న వ్యక్తి నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకున్నట్లు సమాచారం. దాడి సమయంలో 12 లైట్లు వెలగలేదని అప్పటి విద్యుత్ అధికారులు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నట్లు తెలిసింది. వాస్తవాలను పరిశీలించకుండానే పోలీసులు సాక్షుల స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు. కేసును నీరుగార్చే ప్రయత్నాలు పెద్దస్థాయిలో జరిగాయి. ఘటన జరిగిన సమయంలో తీసిన వీడియోల నుంచి అప్పట్లో టీడీపీ ఆధారాలను విడుదల చేసింది. వీటిని పోలీసులు ఉద్దేశపూర్వకంగానే పరిగణనలోకి తీసుకోలేదు.

అవే ఆధారాలతో కేసు ఛేదించారు :రెండేళ్ల కిందట ఘటనా స్థలిలో టీడీపీ విడుదల చేసిన చిత్రాల ఆధారంగానే ప్రస్తుతం కేసు చిక్కుముడి వీడింది. ఆ ఫొటోలను క్షుణ్నంగా విశ్లేషించి, నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. క్లిప్‌లో పరిమి కిశోర్‌ , బెజవాడ కార్తీక్ జెండా దిమ్మె వద్ద నిలబడి ఉన్నారు. వారి కాళ్లవద్ద ఓ కవర్‌లో రాళ్లు ఉన్నాయి. వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా మిగిలినవారి పేర్లు బయటకు వచ్చాయి. ఈ నలుగురు పోలీసుల విచారణలో అసలు కుట్ర వెల్లడించారు. దీంతో పాత సెక్షన్‌ 324తో పాటు కొత్తగా సెక్షన్‌ 120 (బి) (నేరపూరిత కుట్ర), 147, 307, 324, 353 చేర్చారు. అరెస్టైన నిందితులు కన్నెగంటి సజ్జనరావు, బెజవాడ కార్తిక్, పరిమి కిశోర్, మార్త శ్రీనివాసరావులను ఆదివారం తెల్లవారుజామున నందిగామలోని కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయాధికారి ఒక్కొక్కరికి రూ.20,000ల చొప్పున సొంత పూచీకత్తులపై సెల్ఫ్‌ బెయిల్‌ ఇవ్వడంతో విడుదలయ్యారు.

చంద్రబాబు రోడ్ షో లో రాళ్ల దాడిపై పోలీసులు స్పెషల్ ఫోకస్

TDP leaders చంద్రబాబుపై దాడి వెనుక రాజకీయ కుట్ర: టీడీపీ ఎంపీ కనకమేడల

Last Updated : Nov 25, 2024, 7:15 AM IST

ABOUT THE AUTHOR

...view details