Mumbai Actress Case: ముంబయి సినీనటి కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. తాజాగా విచారణకు హాజరయ్యేందుకు ఆమె విజయవాడ చేరుకున్నారు. మధ్యాహ్నం విజయవాడ పోలీసు కమిషనర్‌ను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసు సంబంధించిన వివరాలు, ఆధారాలను విజయవాడ సీపీకి ముంబయి నటి అందించనున్నారు.
ఈ కేసులో నిజానిజాలు తేల్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఏసీపీ స్రవంతిరాయ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని సైతం ఏర్పాటు చేసింది. ముంబయి సినీనటి నుంచి విచారణాధికారి స్రవంతిరాయ్ వివరాలు తీసుకోనున్నారు. అదే విధంగా నమోదు చేసిన ఫోర్జరీ కేసునూ విచారణాధికారి పరిశీలించనున్నారు. ఈ వ్యవహారంలో ఐపీఎస్‌ల ప్రమేయంపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. బాధితురాలితో ఇప్పటికే విచారణాధికారి స్రవంతిరాయ్ మాట్లాడారు.
కాగా ముంబయి సినీనటి వేధింపుల వ్యవహారం రోజుకో మలుపుతిరుగుతోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఉన్నత స్థాయి దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి ప్రతి అంశాన్ని దర్యాప్తు చేయనున్నారు. దీనిపై ఇప్పటికే పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా అవసరం అయితే పోలీసు బృందాలు ముంబయికి సైతం వెళ్లే అవకాశాలున్నాయి.
కుక్కల విద్యాసాగర్ మోసం :గతంలో వైఎస్సార్సీపీ హయాంలో ముంబయికి చెందిన సినీనటిని వైఎస్సార్సీపీ పెద్దలు, కొందరు ఐపీఎస్ అధికారులు వేధించారనే వార్త గత కొద్ది రోజులుగా ప్రకంపనలు సృస్టిస్తోంది. ఈ వ్యవహారంలో కృష్ణా జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ప్రేమపేరిట వెంట తిరిగి పెళ్లి చేసుకోకుండా మోసగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనపై, తన కుటుంబ సభ్యులపై కేసులు పెట్టి బెదిరించి తమ జోలికి రాకుండా రాజీ చేసుకున్నట్లు ఆమె ఆరోపించారు. వేధింపుల వెనుక వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు, పలువురు ఐపీఎస్ అధికారులు కీలకంగా పని చేసినట్లు తెలుస్తోంది.
ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు :సినీనటికి సంబంధించిన కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో ప్రతి విషయాన్నీ క్షుణ్నంగా సేకరిస్తున్నారు. ప్రధానంగా ఐపీఎస్ అధికారులపై వచ్చిన ఆరోపణలలో ఎంతవరకు వాస్తవం ఉందనే విషయాన్ని తెలుసుకుంటున్నారు.
పోలీసుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు - ముంబయి సినీ నటిపై కేసు నమోదు, దర్యాప్తులో అనేక లొసుగులు - Mumbai Actress Harassment Case
హీరోయిన్ వేధింపుల కేసులో విచారణకు ఆదేశం- ముంబయికి పోలీసు బృందాలు - చిక్కుల్లో IPSలు - Mumbai Actress Case Updates